తాగునీటి కోసం మహిళల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం మహిళల రాస్తారోకో

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

రాయదుర్గం టౌన్‌: స్థానిక 19వ వార్డు అంబేడ్కర్‌ కాలనీవాసులు తాగునీటి కోసం శనివారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. వారం రోజులవుతున్నా నీరు సరఫరా చేయకపోతే అవసరాలు ఎలా తీరుతాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం ట్యాంకర్‌ ద్వారా కూడా నీరు సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్కెక్కి నిరసన తెలుపడంతో బీటీపీ రహదారిపై అరగంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం సిబ్బంది అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేసి పరిస్థితిని చక్కదిద్దారు.

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి

కుందుర్పి: మండలంలోని మహంతపురం, జంబుగుంపల, ఎర్రగుంట గ్రామాల్లో 20 రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో శుక్రవారం ఎర్రగుంట గ్రామస్తులు సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. జంబుగుంపల్లో ఉన్న మంచినీటి పథకానికి సంబంధించిన బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య నెలకొందంటున్నారు. 20 రోజులుగా తాగునీరు అందకపోవడంతో అధికారులకు విన్నవించినా ఫలితం దక్కలేదని గ్రామానికి చెందిన మహిళలు మారెక్క, లక్ష్మీదేవి, యల్లక్క, రూప తదితరులు వాపోయారు. అలాగే మహంతపురంలో పక్షం రోజులుగా తాగునీరు అందకపోవడంతో వ్యవసాయ బోరుబావుల వద్ద తెచ్చుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement