అత్యాశకు పోయి.. దొంగగా మారి | - | Sakshi
Sakshi News home page

అత్యాశకు పోయి.. దొంగగా మారి

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

కదిరి: ట్రాన్స్‌కో ఉద్యోగి దొంగలా మారడం.. పోలీసులకు పట్టుబడి జైలులో ఊచలు లెక్కపెడుతున్న విషయం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు రూ.లక్ష జీతం ఉన్న ఉద్యోగి దొంగలా ఎందుకు మారాడు? అన్న విషయంపై ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. వివరాలు..

స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో సీనియర్‌ అసి స్టెంట్‌గా పనిచేస్తున్న బుక్యా రమేష్‌నాయక్‌ ఒకప్పుడు కుటాగుళ్లలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. తనకు పరిచయం లేకపోయినా ఏదైనా పనిమీద ట్రాన్స్‌కో కార్యాలయానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, అక్కడున్న అధికారులకు చెప్పి వారి సమస్యలు పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందేవాడు. రెండేళ్ల క్రితం కదిరి పట్టణంలోని మారుతీనగర్‌లో రూ.50 లక్షలు విలువ చేసే సొంతింట్లోకి వెళ్లి తల్లిదండ్రులతో పాటు పిల్లనిచ్చిన అత్తమామల ప్రశంసలు అందుకున్నాడు.

కొంప ముంచిన తోటి ఉద్యోగి సలహా..

రమేష్‌నాయక్‌ పనిచేసే కార్యాలయంలో ఓ ఉద్యోగికి షేర్‌ మార్కెట్‌ పిచ్చి. తనకు అందులో రూ.లక్షల్లో లాభాలు వస్తున్నాయని తోటి ఉద్యోగులతో చెప్పేవాడు. ఆ మాటలకు ఆకర్షితుడైన రమేష్‌ నాయక్‌ షేర్లపై దృష్టి సారించాడు. యూట్యూబ్‌ ద్వారా కొంత తెలుసుకొని ఆ ఊబిలోకి దిగాడు. అనతి కాలంలోనే లక్ష కాదు..రెండు లక్షలు కాదు..రూ.80 లక్షలు నష్టపోయాడు. బ్యాంకుల్లోనే కాకుండా కొంత మంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి ఏమి చేయాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ విషయంలో తరచూ భార్యతో గొడవ పడుతుండే వాడు. ఆమె పుట్టింటి వారికి విషయం తెలిసి అల్లుడు చెప్పిన రూ.40 లక్షల అప్పులు తీర్చి, ఇక షేర్‌ మార్కెట్‌ జోలికి వెళ్లొద్దని సలహా ఇచ్చారు. రమేష్‌ను ఈ ఊబిలోకి దింపిన ఉద్యోగి కూడా షేర్‌ మార్కెట్లో రూ.20 లక్షలు నష్టం రావడంతో తేరుకొని షేర్‌లకు స్వస్తి పలికాడు.

మళ్లీ అదే ఊబిలోకి ..

భార్యతో పాటు అత్తమామలకు తెలియకుండా చేసిన మరో రూ.40 లక్షల అప్పులు తీర్చేందుకు రమేష్‌ షేర్‌ మార్కెట్‌ను వదల్లేకపోయాడు. భార్యకు అనుమానం వచ్చి ‘నువ్వు ఇంక మారవా..?’ అని చెప్పి 10 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పులోళ్ల బాధలు తట్టుకోలేక మరింత మానసిక వేదనకు గురయ్యాడు. ఏమి చేయాలో దిక్కు తెలియక నిద్రలేని రాత్రులు గడిపాడు.

దొంగగా మారి...

రమేష్‌ ఇంట్లో ఒక్కడే ఉంటూ టీవీ ఆన్‌ చేశాడు. సీరియల్‌ వస్తోంది. అందులో ఓ యువకుడు ఓ మహిళ మెడలో బంగారు చైను లాక్కెళ్లి గోల్డ్‌షాప్‌లో అమ్మి సొమ్ము చేసుకోవడం చూశాడు. ఆ దృశ్యం ఇతని మనసులో నాటుకుపోయింది. మరుసటి దినం (ఏప్రిల్‌ 28న) రమేష్‌ కదిరి – హిందూపూర్‌ రోడ్‌లో టీ తాగేందుకు తన స్కూటీపై వెళ్తుంటే ఇళ్లలో పని చేసుకునే శాంతి ఆయన కంట పడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైను లాక్కొని అక్కడి నుంచి జారుకున్నాడు.

పోలీసులకు పట్టుబడింది ఇలా...

బాధిత మహిళ శాంతి ఫిర్యాదు మేరకు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఈ కేసును పట్టణ సీఐ నారాయణరెడ్డికి అప్పగించారు. ముందుగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ మహిళ మెడలో చైను లాక్కెళ్లిన వ్యక్తి వాడిన స్కూటీ బ్లూ కలర్‌ (నంబర్‌ ఏపీ 39హెచ్‌ వీ.3804) అని పోలీసులు గుర్తించారు. ఈ నెల 2న ఉదయాన్నే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పోలీసులు రమేష్‌నాయక్‌ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.2 లక్షలు విలువ చేసే బంగారు చైనుతో పాటు స్కూటీని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

విలపించిన కుటుంబ సభ్యులు..

విషయం తెలిసి ఆయన భార్యతో పాటు అత్తమామలు ఇంటికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. షేర్‌ మార్కెట్‌ వ్యసనం నుంచి ఎలా బయట పడేయాలో తెలియక తాము బాధపడుతుంటే మళ్లీ ఈ దొంగ కేసేంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘దయచేసి ఎవరూ ఇలాంటి షేర్‌మార్కెట్ల జోలికెళ్లి.. తప్పుడు మార్గాన్ని ఎంచుకోకండి’ అని విన్నవించారు.

మిత్రుడి సలహాతో షేర్‌ల ఊబిలోకి దిగిన ట్రాన్స్‌కో ఉద్యోగి

అప్పులపాలై చోరీల బాట

Advertisement
 
Advertisement
Advertisement