
మొత్తం ఖాళీలు 7,710
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేయడంతో జిల్లా అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయనుండగా, ఎస్జీటీ కేడర్ టీచర్లను కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేసేలా షెడ్యూలులో పేర్కొన్నారు. అయితే మ్యానువల్‌గా నిర్వహిస్తారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు, సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే తప్పనిసరిగా బదిలీ అయ్యే హెచ్‌ఎంలు, టీచర్ల లెక్కలు తేల్చారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్–మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఈ నాలుగు యాజమాన్యాల కింద జిల్లాలో మొత్తం 14,784 మంది అన్ని కేడర్ల టీచర్లు పని చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల పాఠశాలల్లో ఏడు రకాల ఖాళీలను గుర్తించారు. మొత్తం 7,710 ఖాళీలను తేల్చారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 193, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో 6,225, మునిసిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 231, మునిసిపల్ స్కూళ్లలో 1,061 ఖాళీలున్నట్లు గుర్తించారు.
ఏడు రకాల ఖాళీలు ఇలా...
అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 5/8 ఏళ్లు పూర్తయిన హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ఖాళీలు 3,826 ఉన్నాయి. రీ–అపోర్షన్ ఖాళీలు 2,913, స్పష్టమైన ఖాళీలు 942, ఫారెన్ సర్వీస్ కింద వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలు 5, బాలికల పాఠశాలల్లో పురుష టీచర్లు పని చేస్తూ ఏర్పడిన ఖాళీలు 02, వివిధ డిగ్రీలు చేసేందుకు సెలవులో వెళ్లిన టీచర్ల స్థానాల్లో ఏర్పడిన ఖాళీలు 19, అనధికార గైర్హాజరుతో ఏర్పడిన ఖాళీలు 3 ఉన్నట్లు వెల్లడైంది.
బదిలీల షెడ్యూలు ఇలా...
హెచ్‌ఎంల బదిలీలకు సంబంధించి గురువారం ఆన్‌లైన్ దరఖాస్తు, పరిశీలన, 24న ప్రొవిజనల్ సీనియార్టీ జాబితా, 25న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 26న అభ్యంతరాల పరిష్కారం, 27న ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల, 28న వెబ్ ఆప్షన్స్, 30న బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. అదేరోజు స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్‌ఎంల పదోన్నతుల వెబ్ ఆప్షన్, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వీరికి 31న పదోన్నతల ఉత్తర్వుల జారీ ఉంటుంది.
స్కూల్ అసిస్టెంట్ కేడర్‌కు సంబంధించి...
24 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు. 25–దరఖాస్తుల పరిశీలన. 26,27 తేదీల్లో ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్‌లైన్ ప్రదర్శన, 28న అభ్యంతరాల స్వీకరణ, 28,29 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 31న ఫైనల్ జాబితా ప్రకటన, జూన్ 1,2 తేదీల్లో వెబ్ ఆప్షన్, 4న బదిలీ ఉత్తర్వుల జారీ. 05న ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్, 06న పదోన్నతుల ఉత్తర్వుల జారీ.
ఎస్జీటీ కేడర్‌కు సంబంధించి...
ఈనెల 27 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు. 28–దరఖాస్తుల పరిశీలన. 31న ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్‌లైన్ ప్రదర్శన, జూన్ 01న అభ్యంతరాల స్వీకరణ, 01,02 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 06న ఫైనల్ జాబితా ప్రకటన, 07 నుంచి 10 వరకు తేదీల్లో వెబ్ ఆప్షన్, 11న బదిలీ ఉత్తర్వుల జారీ. వీరికి మ్యానువల్ కౌన్సెలింగ్ ఉన్నా ఈ షెడ్యూలు మేరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
టీచర్ బదిలీల ప్రక్రియ వేగవంతం
30న హెచ్‌ఎంల బదిలీల ఉత్తర్వులు
జూన్ 4న స్కూల్ అసిస్టెంట్, 11న ఎస్జీటీలకు..