
ఎట్టకేలకు మొదలైన విత్తనశుద్ధి
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టారు. ఖరీఫ్ సమీపిస్తున్నా రైతుల కష్టాలు కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని, వ్యవసాయఽశాఖ మొద్దునిద్ర వీడటం లేదని ‘సాక్షి’లో ఇటీవల వరుసగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో 40 శాతం మేర రాయితీ, అమ్మకం ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించక మునుపే బుధవారం విత్తనశుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉన్న విజయా ఆగ్రోసీడ్స్ ప్లాంట్‌లో ఏడీఏ ఎం.రవి ఆధ్వర్యంలో విత్తనశుద్ధిని ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందించడానికి వీలుగా ప్రాసెసింగ్ చేయాలని ఏడీఏ ఆదేశించారు. ప్రాసెసింగ్ పూర్తయిన వెంటనే ఆర్‌ఎస్‌కేలకు సరఫరా చేయాలని సూచించారు. జూన్ మొదటి వారంలో విత్తన పంపిణీ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ!
విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు సమాచారం. అలాగే క్వింటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.9,300 ప్రకారం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై అటు వ్యవసాయశాఖ, ఇటు ఏపీ సీడ్స్ అధికారులు మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇక.. కందులు, చిరుధాన్యాల ధరలు కూడా ఖరారు కాలేదు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తన కేటాయింపులు, ధరలు, రాయితీలు ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా.. ఒక్క క్వింటా కూడా సరఫరా కాకపోవడం విశేషం.