
మహాత్మా.. వారికి మంచి బుద్ధి ప్రసాదించు!
అనంతపురం సిటీ: మడకశిర, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు శాంతియుత నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానమైన సమస్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో ముగ్గురు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్‌లోకి ఎటువంటి ముందస్తు అను మతి లేకుండా వెళ్లడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించిన తీరుపై జెడ్పీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపినట్లు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తెలిపారు. చైర్‌పర్సన్ చాంబర్‌లోకి వెళ్లి రచ్చ చేసి.. జాతిపిత మహాత్ముడి చిత్రపటాన్ని తొలగించి సీఎం చంద్రబాబు ఫొటో పెట్టడం, మాజీ సీఎం జగన్ ఫొటో పూర్తిగా తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే జెడ్పీ సమావేశంలో చైర్‌పర్సన్ గిరిజమ్మ, కలెక్టర్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లకుండా.. అధికారం అండతో దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సీఈఓను ఏకవచనంతో దూషించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా.. సమావేశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు.