
రూ.37 లక్షల మెస్ బిల్లులకు లెక్కల్లేవ్
● డీఎంఈకి నివేదించిన విచారణ కమిటీ
● అకౌంటెంట్ వాణిపై ఫిర్యాదు చేయాలని డీఎంఈ ఆదేశం
అనంతపురం మెడికల్: బోధనాస్పత్రిలో వైద్య విద్యార్థుల మెస్ బిల్లులకు సంబంధించి రూ.37 లక్షలకు లెక్కలు సరిగా లేవని విచారణ కమిటీ సభ్యులు డీఎంఈ డాక్టర్ నర సింహంకు తెలియజేశారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాలలోని లైబ్రరీలో జరిగిన విచారణను డీఎంఈ పరిశీలించారు. విచారణ కమిటీ, వార్డెన్లతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ విద్యార్థుల మెస్ బిల్లులు సంబంధిత అకౌంట్ నుంచి కాకుండా వైద్య విద్యార్థుల అకౌంట్ నుంచి అకౌంటెంట్‌కు వెళ్లినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు విచారణకు ఆదేశించారు. డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ సురేష్ తదితరులతో కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన కమిటీ సభ్యులు.. నలుగురు విద్యార్థుల వ్యక్తిగత అకౌంట్లకు ఒకరి ఖాతాలో రూ.30 లక్షలు, మరొకరి ఖాతాలో రూ.5 లక్షలు, ఇంకొకరి ఖాతాలో రూ.2 లక్షల వరకు జమ చేసినట్లు, వారి ద్వారా అకౌంటెంట్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అందులో రూ.17 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు గోల్‌మాల్ జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో వార్డెన్ డాక్టర్ సుచిత్ర, డిప్యూటీ వార్డెన్లు డాక్టర్ విజయ, తదితరుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో అకౌంటెంట్ వాణిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావును డీఎంఈ నరసింహం ఆదేశించారు.