
టీచర్ల బదిలీలకు వేళాయె
● నేటి నుంచి హెచ్‌ఎంల బదిలీలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్యాల స్కూళ్లల్లో మొత్తం 14,784 మంది హెచ్‌ఎంలు, టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ప్రధానోపాధ్యాయులు, 329 మంది పీఎస్‌హెచ్‌ఎంలు, 6,850 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7,230 మంది ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులున్నారు. ముందుగా బుధవారం నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. హెచ్‌ఎం పోస్టులు 178 ఖాళీలుఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు మునిసిపాలిటీ యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్–2 హెచ్‌ఎంలు ఈనెల 31 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తయ్యే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థన బదిలీ కోరుకునేవారు (ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్‌లో రెండేళ్లు పూర్తయి ఉండాలి) కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.