
అధికారులే టో(తో)లు తీశారు!
అనంతపురం క్రైం: ఆర్టీసీ ఆదాయానికి అధికారులే గండి కొట్టారు. సంస్థను లాభాల్లో నడిపించాల్సింది పోయి జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా ఈ రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందల కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూడాల్సి వచ్చింది.
అద్దె బస్సుల టెండర్లలో కీలక నిబంధన గాలికి
ఆర్టీసీకి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో అద్దె బస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆన్‌లైన్ టెండరు నిర్వహించారు. టెండరులో పాల్గొనే వాహన యజమానులకు 200పై చిలుకు నిబంధనలు విధించారు. ఇందులో 1 నుంచి 10 వరకు కీలక షరతులు ఉన్నాయి. ప్రధానంగా అద్దెకు ఇచ్చే బస్సు ఏ జిల్లాలో అయితే నడుపుతారో ఆ జిల్లాలోనే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇక్కడే అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. జిల్లాలో 100కు పైగా అద్దె బస్సులను తిప్పుతున్నారు. ఇందులో 70కి పైగా అద్దె బస్సులు ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించినవి కావడం గమనార్హం. సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ), రీజనల్ మేనేజర్ (ఆర్‌ఎం) ఉదాసీన వైఖరి కారణంగా అద్దె బస్సుల టెండర్ ఖరారులో కీలక నిబంధన కాస్త కనుమరుగైంది. ఈడీ అలాంట్‌మెంట్ ఆర్డరు ఇచ్చినప్పుడు అద్దె బస్సుకు లోకల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను పొందుపరిచినప్పటికీ జిల్లా స్థాయి అధికారి తుంగలో తొక్కి 9 ఏళ్ల కాల వ్యవధితో అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపేలా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు అనుమతులు ఇచ్చేశారు. ఈ అనుమతుల జారీ వెనుక సదరు జిల్లా స్థాయి అధికారి భారీగా ముడుపులు దండుకున్నట్లుగా సంస్థ ఉద్యోగులే బాహాటంగా పేర్కొనడం గమనార్హం.
సంస్థకు చేకూరిన నష్టమిలా..
లోకల్ రిజిస్ట్రేషన్ అయిన అద్దె బస్సులను ఆర్టీసీ నడిపితే టోల్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. 30 రోజుల పాటు ఒక బస్సు రోజుకు 366 కిలో మీటర్లు తిరిగితే నెలకు రూ.50 వేలు టోల్‌ఫీజు చెల్లించాలి. లోకల్ వాహనమైతే రూ.25 వేలతో సరిపోతుంది. కాగా నాన్‌లోకల్ వాహనం కావడంతో నెలకు అదనంగా ఆర్టీసీ రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్కన ఒక అద్దె బస్సుకు రెండేళ్లలో టోల్ ఫీజు కింద అదనంగా రూ.6 లక్షలను ఆర్టీసీ చెల్లించింది. ఇలా జిల్లాలో నాన్‌లోకల్ కింద రిజిస్ట్రేషన్ కలిగిన 70కి పైగా అద్దె బస్సులకు అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంస్థ రూ.4.20 కోట్లు నష్టపోయింది.
నష్టాన్ని గుర్తించిన చిరుద్యోగి
లోకల్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సులకు టోల్‌ఫీజు రాయితీ కోల్పోతోందనే విషయాన్ని ఓ చిరుద్యోగి గుర్తించారు. ఈ విషయాన్ని తన కార్యాలయంలోని ఆర్‌ఎంకు వివరించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సదరు అధికారి మాత్రం కిమ్మనకుండా చేతులెత్తేశారు. కాగా, ఈ సమస్యను సదరు ఉద్యోగి గుర్తించి నేటికి ఆరు నెలలు కావస్తోందని సమాచారం. అకౌంట్ సెక్షన్ ఏం చేస్తోందంటూ తొలుత ఆర్‌ఎం హంగామా చేసినా క్రమేణా ఆ ఊసే ఎత్తకుండా మిన్నకుండిపోయారు. కాగా ఈ విషయం తెలుసుకున్న జిల్లాలోని ఓ డిపోలో అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఈ సమస్య తన తలకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ ఆర్‌ఎంకు లేఖ ఇచ్చినట్లుగా సమాచారం.
ఇప్పటికీ అదే నిర్లక్ష్యం
ఆరు నెలల క్రితమే ఓ చిరుద్యోగి జరుగుతున్న నష్టాన్ని పసిగట్టి సంస్థ ఏడాదికి ఎంత మేర నష్టపోతుందో గణాంకాలతో వివరించినా.. చర్యలు తీసుకోవడంలో అధికారులు మీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. సదరు అద్దె బస్సుల యజమానులకు నోటీసులు జారీ చేసి ఇప్పటికై నా నష్టాన్ని పూడ్చాలని సలహా ఇచ్చిన పాపానికి ఉన్నతాధికారులు అందరూ ఏకమై విషయాన్ని తొక్కి పెట్టినట్లు సమాచారం. సమస్య గుర్తించిన తక్షణమే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఆరు నెలల్లో రూ. కోట్లలో నష్టాన్ని అరికట్టి ఉండవచ్చు. అయినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
అద్దె బస్సులతో ఆర్టీసీకి
రూ.కోట్లలో నష్టం
లోకల్ రిజిస్ట్రేషన్ ఉండాలన్న
ప్రధాన నిబంధన తుంగలోకి
నాన్‌లోకల్ వాహనాలు కావడంతో టోల్ ఫీజు చెల్లింపునకు వర్తించని రాయితీ