
కలెక్టరేట్ ఎదుట 102 వాహన డ్రైవర్ల ధర్నా
అనంతపురం అర్బన్: వేతన బకాయిలు చెల్లించడంతో పాటు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ కలెక్టరేట్ ఎదుట తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102 వాహనాలు) డ్రైవర్ల మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్ మాట్లాడారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లుగా 500 మంది అరబిందో సంస్థ ద్వారా ఆరోగ్యశాఖకు సేవలందిస్తున్నారన్నారు. ఏడేళ్లుగా తమకు కేవలం రూ.8,800 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, గత మూడు నెలలుగా అదీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీటీసీ పేరిట యాజమాన్యం కట్టాల్సిన పీఎఫ్ వాటానూ ఉద్యోగుల నుంచే మినహాయిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. వేతనాన్ని పెంచి ప్రతి నెలా రూ.18,500 కచ్చితంగా ఇవ్వాలన్నారు. తన వాటా పీఎఫ్‌ను యాజమాన్యమే చెల్లించాలన్నారు, చట్టప్రకారం సెలవులు అమలు చేయాలన్నారు. ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాదంలో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలు చెల్లించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్‌కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సాయిచరణ్, కోశాధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
● డీఎంఈ నరసింహం