
‘కూటమి’ అరాచకాలకు భయపడొద్దు
పుట్లూరు: కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ భరోసానిచ్చారు. పుట్లూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. సమావేశంలో శైలు మాట్లాడారు. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ప్రతి మండలంలో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్హతే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సమష్టి కృషి, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.రాఘవరెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ నాగేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్