
విద్యతోనే ఉజ్వల భవిత
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థి చదువులపై దృష్టి సారించి ఉన్నత విద్యాభ్యాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పదో తరగతి, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన వాల్మీకి/బోయ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులకు సోమవారం స్థానిక రుద్రంపేట సమీపంలోని వాల్మీకి కల్యాణమంటపంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరేలా పట్టుదల, ఏకాగ్రతతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌సీ అక్కులప్ప, ప్రధాన కార్యదర్శి ఎ. చైతన్యకుమార్, కోశాధికారి జి. పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, విశ్రాంత డీఎఫ్‌ఓ ఆదినారాయణ, ఏడీసీసీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు, తలారి ఆదినారాయణ, ఎంఈఓ వాణీదేవి, అంకె ముత్యాలు, మాజీ సీఈఓ ఈశ్వరయ్య, నాగభూషణం పాల్గొన్నారు.
వాల్మీకి విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవంలో వక్తలు