
నకిలీ అక్రిడిటేషన్ వ్యవహారంలో వ్యక్తి అరెస్ట్
అనంతపురం: జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్‌లు సృష్టించిన వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్‌టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే చందులాల్‌నాయక్, మన్నల దేవరాజు ఇద్దరూ కలిసి నకిలీ అక్రిడిటేషన్లు సిద్ధం చేసుకుని వాటిపై జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు అక్రిడిటేషన్ కార్డుగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్బడుతున్నట్లుగా తెలుసుకున్న డీఐపీఆర్‌ఓ గురుస్వామిశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సోమవారం మన్నల దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న చందులాల్‌నాయక్ కోసం గాలిస్తున్నారు.
సూపర్ సిక్స్ అమలు చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ జిల్లా మహాసభలను జూలై 25 నుంచి 27వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు, ఇతర ప్రజాసమస్యలపై జిల్లా మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల హామీ మేరకు పట్టణ పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ పేదలకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలనే డిమాండ్‌తో జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నామన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, కేశవరెడ్డి, రాజేష్‌గౌడ్, రామాంజినేయులు పాల్గొన్నారు.