
వాహనం ఢీకొని యువకుడి మృతి
బెళుగుప్ప: వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరుకు చెందిన మహేష్(21), తన మిత్రుడు కాలువపల్లి తండా గ్రామానికి చెందిన భానుప్రకాష్ నాయక్‌తో కలసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి కాలువపల్లికి బయలుదేరాడు. మానిరేవు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ అటుగా వెళుతున్న వారు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మహేష్ మృతిచెందినట్లుగా నిర్ధారించారు. భానుప్రకాష్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దుర్మరణం
బత్తలపల్లి: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆటో నడుపుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ముదిగుబ్బకు చెందిన మట్రా ఆంజనేయులు (59), అలివేలమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులు ఆటోలో గ్రామాలు తిరుగుతూ తెల్లగడ్డలు విక్రయం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఽతెల్లవారుజామునే ముదిగుబ్బ నుంచి ధర్మవరానికి ఆటోలో బయలుదేరారు. బత్తలపల్లి మండలం వేల్పుమడుగు క్రాస్ దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా బండల లోడుతో దూసుకువచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన అలివేలమ్మను అటుగా వచ్చిన వారు గుర్తించి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.