
‘రెడ్‌బుక్ కుట్రలో భాగమే అక్రమ అరెస్టులు’
ఉరవకొండ: తప్పడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా విశ్రాంత అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది రెడ్‌బుక్ కుట్రలో భాగమేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమని అన్నారు. అధికారులన్న కనీస గౌరవం లేకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షపార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు నేరవేర్చే ధైర్యం లేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సాఆర్‌సీపీ నేతలతో పాటు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు బసవరాజు పాల్గొన్నారు.