
జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి
అనంతపురం కార్పొరేషన్: ‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారు. 11 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చడం లేదు. జగనన్న నాయకత్వంలో ప్రజలకు చేసిన మేలును ప్రజలకు వివరిద్దాం’ అని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. శనివారం న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన గ్లోబల్ కనెక్ట్ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను ఆయుధాలుగా చేసుకుని జగనన్న చేసిన మేలును ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. అలాగే కూటమి కుట్రలు, వైఫల్యాలను తెలియజేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ న్యూజిల్యాండ్ కన్వీనర్ బుజ్జిబాబు, కో కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి తదితరులు పాల్గొన్నారు.