
గెలుపునకు అడ్డదారులా?
ఆత్మకూరు: గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని, ఇందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన మలరాయుడు, వైస్ ప్రెసిడెంట్ స్థానానికి పోటీ చేసిన శివప్రసాద్ ఆరోపించారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. గొర్రెల, మేకల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలకు ఈ ఏడాది జనవరి 25న మదిగుబ్బలో ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. గ్రామంలొ మొత్తం 152 మంది సభ్యులుండగా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థి మలరాయుడుకు 93 మంది, టీడీపీ మద్దతు అభ్యర్థి నరసింహులుకు 12 మంది సభ్యులు మద్దతు పలికారన్నారు. ఇది గిట్టని టీడీపీ నేతలు అధ్యక్ష స్థానం తమకే దక్కాలన్న అక్కసుతో దాదాపు 50 మంది పోలీసులను అడ్డం పెట్టుకుని గొడవ చేసి ఎన్నికలను వాయిదా పడేలా చేశారన్నారు. ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత 152 సభ్యుల్లో కేవలం 90 మందికి మాత్రమే సభ్యత్వం ఉందని అధికారులు చెబుతున్నారని, అలాగే రెండు రోజుల క్రితం పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి టీడీపీకి అనుకూలంగా ఉన్న 67 మందిని సభ్యులుగా చేర్చారని వివరించారు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కొత్త సభ్యులను ఎలా చేరుస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. 2018 నాటికి సంఘంలో 90 మంది సభ్యులు ఉన్నారని, 2019లో ప్రెసిడెంట్ స్థానానికి పోటీ చేసిన పోతిరెడ్డి 62 మందికి చలానాలు కట్టి సభ్యులుగా చేర్చారని గుర్తు చేశారు. చలానా కట్టి సభ్యులుగా పేర్లు నమోదు చేయాలంటే ఆడిట్ తప్పనిసరిగా చేయాల్సి ఉందన్నారు. 2017 నుంచి 2018 వరకు ఆడిట్ ప్రక్రియను ఎందుకు చేపట్టలేదో అధికారులకే తెలియాలన్నారు. దొంగ రసీదులు సృష్టించి అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ఆడిన చదరంగంలో అధికారులు పావులుగా మారారన్నారు. ఈ అంశంపై పంపనూను పశువైద్యాధికారి దిలీప్‌ను వివరణ కోరగా... ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు కొత్తగా 67 మంది సభ్యులను చేర్చినట్లు తెలిపారు. ఏపీసీఎస్ యాక్ట్ 1964 సెక్షన్ 19 ప్రకారం వారందరూ సభ్యులుగా పరిగణించబడుతారని వివరించారు.
గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో వంచనకు తెరలేపిన అధికారులు
ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత జాబితాలో కొత్తగా 67 మంది చేర్పు