
ఉద్దేహాళ్‌లో ఆగిపోయిన ధాన్యం లారీలు
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో 20 రోజుల క్రితం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లారీల్లోనే ఆగిపోయింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శ్రీకాళహస్తిలో మిల్లర్లకు బ్యాంకు ష్యూరిటీ లేదని లారీలను అడ్డుకున్నారు. మూడు రోజులుగా లారీలు ఆగిపోవడంతో డ్రైవర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ‘మీ ధాన్యం రవాణా చేయడం కష్టం.. బస్తాలను ఇక్కడే అన్‌లోడ్ చేసుకోండి’ అంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బస్తాలు కిందికి దించితే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
నేనే ‘రాజు’... నేనే మంత్రి
● విమర్శలకు తావిస్తున్న కూడేరు పీఎస్ సీఐ రాజు వ్యవహారం
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూడేరు పీఎస్ సీఐ రాజు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా నేనే రాజు.. నేనే మంత్రినంటూ వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్‌ను టీడీపీ కార్యాలయంగా మార్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్ప మరెవ్వరూ అక్కడ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదినం సందర్భంగా కూడేరు జెడ్పీహెచ్‌ఎస్‌లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమానికి ఏకంగా యూనిఫాంలో హాజరై ఆ పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కటింగ్‌లు చేస్తూ హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంత్రి కేశవ్‌కు సీఐ రాజు షాడోగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి అధికారి ఇక సామాన్యులకు న్యాయం ఎలా చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఉద్దేహాళ్‌లో ఆగిపోయిన ధాన్యం లారీలు