
యువకుడి అనుమానాస్పద మృతి
అనంతపురం: స్థానిక అశోక్‌నగర్‌లో నివాసముంటున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వన్‌టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం నిమ్మగల్లుకు చెందిన తిప్పేస్వామి కుమారుడు శివప్రసాద్ (22) అనంతపురంలో డీజేగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న ఉదయం ఉరవకొండ నుంచి అనంతపురానికి వచ్చి అశోక్‌నగర్‌లోని తన స్నేహితులతో కలిసి రూంలో ఉంటున్నాడు. కియా పరిశ్రమలో పనిచేస్తున్న స్నేహితులందరూ బుధవారం విధులకు వెళ్లి రాత్రి 2 గంటలకు గదికి చేరుకున్నారు. అప్పటికే గదిలో నిద్రపోతున్న శివకుమార్ లేచి తలుపు తీసి, కాసేపు మాట్లాడి తిరిగి గదిలోనే నిద్రపోయాడు. గురువారం ఉదయానికి మృతి చెంది కనిపించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. టవాల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్నేహితులు తెలిపారు. అయితే టవాల్‌తో ఉరి వేసుకోవడం సాధ్యం కాదనే వాదనలు వినిపించాయి. ఘటనపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కారు దగ్ధం
ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వెనిల్ అనే వ్యక్తితో కలసి మరో వ్యక్తి అనంతపురం నుంచి కారులో ధర్మవరానికి బయలుదేరాడు. చిగిచెర్ల సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి పొగలు రాసాగాయి. గమనించిన వారు కారు ఆపి కిందకు దిగారు. అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.