
మరోసారి ఫయాజ్ ఇంటికి మున్సిపల్ అధికారులు
తాడిపత్రి రూరల్: తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్ష సాధింపుల పర్వం కొనసాగుతోంది. కమిటీ పేరుతో మరోసారి రెవెన్యూ, మునిసిపల్ అధికారులను గురువారం వైఎస్సార్‌సీపీ నాయకుడు ఫయాబ్‌బాషా ఇంటిపైకి ఉసిగొల్పారు. పట్టణంలోని చిన్న బజారులో ఉన్న ఫయాజ్‌బాషా ఇంటి కొలతల కోసం సోమవారం మునిసిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ వెళ్లింది. వారం క్రితం మొదటిసారి కొలతల కోసం వెళ్లినపుడు తలుపులు మూసేశారనే పేరుతో పంచనామా జరిపి తిరిగి వెళ్లారు. రెండో సారిగా గురువారం వెళ్లిన కమిటీకి మరోసారి తలుపులు మూసి వేసి కనిపించడంతో ఇంటి కొలతలు చేపట్టకుండా మరోసారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పట్టణంలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నా వాటి జోలికి వెళ్లని అధికారులు.. అన్ని అనుమతులతో సక్రమంగా నిర్మించుకున్న ఫయాజ్ ఇంటిపైకి వెళ్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.