
విశ్రాంత డీఈఓ ఆనందమూర్తి కన్నుమూత
అనంతపురం ఎడ్యుకేషన్: విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి సెట్టేల ఆనందమూర్తి (74) కన్నుమూశారు. అనంతపురం నగరంలోని అరవిందనగర్‌లో నివాస ముంటున్న ఆయన.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆనందమూర్తి సొంతూరు శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. భార్య 2008లోనే మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమా రులు సంతానం కాగా... ఇద్దరు హిందీ పండిట్లుగా, ఒకరు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆనందమూర్తి భౌతికకాయానికి గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. ఆనందమూర్తి 1980లో జేఎల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. పదోన్నతిపై 1996 నుంచి 2004 వరకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2006 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐటీడీఏ, ఎస్సీఈఆర్టీలో పని చేసి 2008లో రిటైర్డ్ అయ్యారు. ఆయన మృతి పట్ల ఎంఈఎఫ్ నాయకులు బండారు శంకర్, హనుమంతరావు, రమేష్, రామన్న తదితరులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అప్పట్లో ‘సింగిల్ ఆర్డర్లు’ కలకలం..
ఆనందమూర్తి డీఈఓగా పనిచేసిన కాలంలో జిల్లాలో టీచర్ల బదిలీలకు సంబంధించి ‘సింగిల్ ఆర్డర్లు’ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీలతో పాటు ఆయా ఖాళీలకు డీఈఓ సింగిల్ ఆర్డర్ ఇచ్చి బదిలీలు చేశారు. ఒత్తిళ్ల కారణంగా డీఈఓ కొన్ని ఆర్డర్లు ఇస్తే వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేసి అప్పట్లో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమకు అనుకూలమైన వారికి చాలా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. ఇంకా కొందరు డీఈఓ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి ఆర్డర్లు ఇచ్చారు. ఇలా చేసి పలువురు నాయకులు భారీగా వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో డీఈఓను విశాఖ జిల్లా అరకు ఐటీడీఏకు బదిలీ చేశారు.