ఖరీఫ్‌ సాగులో వైవిధ్యం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ సాగులో వైవిధ్యం

May 15 2025 12:32 AM | Updated on May 15 2025 12:32 AM

ఖరీఫ్

ఖరీఫ్‌ సాగులో వైవిధ్యం

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ పంటల సాగులో వైవిధ్యం కనిపిస్తోంది. ఒకట్రెండు పంటలపై ఆధారపడకుండా రైతులు మరికొన్ని పంటల సాగుపై దృష్టి సారించారు. అలాగే పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరతను దృష్టిలో పెట్టుకుని తక్కువ పెట్టుబడుల పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కొన్ని దశాబ్దాలుగా ఏకపంటగా లక్షల హెక్టార్లలో సాగవుతున్న వేరుశనగ క్రమేణా సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. నల్లరేగడి భూముల్లో కేవలం తెల్లబంగారాన్ని నమ్ముకున్న రైతులు ఇటీవల పత్తి సాగును తగ్గించారు. వేరుశనగ, పత్తి స్థానాల్లో కంది, మొక్కజొన్న బాగా పెరిగింది. అలాగే పాతతరం పంట కొర్ర కూడా పెరుగుతోంది. పెసర, అలసంద, ఉలవ తగ్గిపోగా మినుము, సోయాపై మక్కువ చూపుతున్నారు. సజ్జ, జొన్న, పొద్దుతిరుగుడు పంటలు తగ్గుముఖం పట్టాయి.

గత ఖరీఫ్‌లో ‘కంది’ చరిత్ర

గత ఖరీఫ్‌లో కంది పంట చరిత్రను తిరగరాసింది. తొలిసారిగా లక్ష హెక్టార్లకు పైగా సాగులోకి రావడం గమనార్హం. గతేడాది కంది పంట 37,367 హెక్టార్లలో రావచ్చని అంచనా వేయగా... చివరకు ఏకంగా 1.03 లక్షల హెక్టార్లకు ఎకబాకింది. అంటే మూడింతల సాగు పెరిగింది. 31 మండలాల్లోనూ కందిపై రైతులు మొగ్గుచూపారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో కూడా ఎప్పుడూ కంది పంట 70 వేల హెక్టార్లు దాటకపోవడం గమనార్హం. 11 వేల హెక్టార్లు సాధారణ సాగుగా అంచనా వేసిన మొక్కజొన్న 20 వేల హెక్టార్లకు పెరిగింది. ఇటీవల కాలంలో చాలామంది రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు పంటలకు పెట్టుబడులు తక్కువ కావడంతో విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. కొర్ర కూడా 1,500 హెక్టార్లుగా అంచనా వేయగా రెట్టింపు విస్తీర్ణంలో 3 వేల హెక్టార్లకు పెరిగింది. ఇక ఐదారేళ్లుగా ఆముదం పంట కాస్త అటుఇటుగా 15 వేల హెక్టార్లతో స్థిరంగా కొనసాగుతోంది.

బాగా తగ్గిన వేరుశనగ, పత్తి

గతి తప్పిన వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు ధర లభించని కారణంగా రైతులు వేరుశనగ, పత్తి సాగును తగ్గించేశారు. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 1.98 లక్షల హెక్టార్లు కాగా 57 శాతంతో 1.12 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. అలాగే పత్తి సాగు కూడా 48,586 హెక్టార్లకు గానూ 59 శాతంతో 28,530 హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌ జాబితాలో వేరుశనగ, పత్తి ప్రధాన పంటలుగా ఉండగా... ఇపుడు వాటి స్థానంలో కంది, మొక్కజొన్న పంటలు చేరుతున్నాయి. ఇక నీటి వసతి కింద 20 వేల నుంచి 22 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగులోకి వస్తోంది.

హైబ్రీడ్‌ విత్తన రకాలపై దృష్టి

కంది, మొక్కజొన్న పంటల విస్తీర్ణం పెరుగుతున్న తరుణంలో హైబ్రీడ్‌ రకాల విత్తనాలు రాయితీతో ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో పాతవి ఎల్‌ఆర్‌జీ రకాలు ఇస్తుండటంతో అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎల్‌ఆర్‌జీ కంది రకాలు ఉచితంగా ఇచ్చినా వద్దనే పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో మంచి హైబ్రీడ్‌ రకాలు ఉన్నందున వాటిపై దృష్టి పెడుతున్నారు. అలాగే మొక్కజొన్న, ఆముదం కూడా రాయితీపై ఇస్తే చాలా వరకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.

పెరిగిన కంది, కొర్ర, మొక్కజొన్న

గత ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 1.03 లక్షల హెక్టార్లలో కంది సాగు

3 వేల హెక్టార్లలో కొర్ర, 20 వేల హెక్టార్లకు పెరిగిన మొక్కజొన్న

పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో భారీగా తగ్గిన వేరుశనగ, పత్తి

ఖరీఫ్‌ సాగులో వైవిధ్యం 1
1/1

ఖరీఫ్‌ సాగులో వైవిధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement