
స్నాతకోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహిద్దాం
● జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 17న పకడ్బందీగా నిర్వహిద్దామంటూ సంబంధిత అధికారులకు వర్శిటీ వీసీ హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. స్నాతకోత్సవం నిర్వహణపై సమన్వయ కమిటీ సభ్యులతో బుధవారం వీసీ సమీక్షించారు. ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో స్నాతకోత్సవంలో పాల్గొంటారని, గౌరవ డాక్టరేట్‌ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో హాజరుకానున్న ప్రముఖులకు ఎలాంటి లోటుపాట్లు రానివ్వరాదన్నారు. ఉదయం 9:30 గంటల్లోపు గోల్డ్‌మెడల్స్ గ్రహీతలు, పీహెచ్‌డీ అవార్డులు పొందిన విద్యార్థులు ఆడిటోరియానికి చేరుకునేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ ఎన్.దేవన్న, డైరెక్టర్లు పాల్గొన్నారు.
యువకుడి గల్లంతు
రాయదుర్గం టౌన్: స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు బావిలో గల్లంతయ్యాడు. వివరాలు... రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రి వెనుక వీధిలో నివాసముంటున్న సత్యనారాయణ, పద్మ దంపతుల కుమారుడు బోయ రాజశేఖర్ (30)కు భార్య నేత్ర, ఇద్దరు కుమారులు ఉన్నారు. గార్మెంట్స్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం నలుగురు స్నేహితులతో కలసి రాజశేఖర్ స్థానిక దుగ్గిలమ్మ ఆలయం వద్ద ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. బావిలో దిగిన రాజశేఖర్ కొద్ది సేపటికే గల్లంతయ్యాడు. దీంతో భయపడిన స్నేహితులు బయటకు వచ్చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు విషయం తెలుసుకున్న బంధవులు, పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. గత ఈతగాళ్లను రంగంలో దించారు. బావిలో పూర్తి స్థాయిలో నీరు ఉండడం, లోతు కూడా ఎక్కువగా ఉండడంతో ఆచూకీ లభ్యం కాలేదు. సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా, ఈత రాని రాజశేఖర్‌ను స్నేహితులు బలవంతం చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాక అప్పటికే స్నేహితులందరూ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

స్నాతకోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహిద్దాం

స్నాతకోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహిద్దాం