
వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి రాఘవులు
వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి రాఘవులు
అనంతపురం కల్చరల్: సమాజంలో పెరిగిన ఆర్థిక అసమానతల వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి వై.రాఘవులు అన్నారు. బుధవారం అనంతకు విచ్చేసిన ఆయన స్థానిక కోర్టురోడ్డులోని శివకృప (ఆర్‌ఎస్‌ఎస్ భవన్)లో జిల్లా అర్చక ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. సనాతన హైందవ ప్రచారానికి ప్రాముఖ్యతనిచ్చే అర్చకులు మరిన్ని మార్గాల ద్వారా ధర్మాన్ని కాపాడాలని సూచించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు దేశకాల పరిస్థితులను వివరించడం, పరిణామ సంకీర్తనలు చేయించడం, సేవా కార్యక్రమాలలో అందరనీ భాగస్వాములను చేయడం ద్వారా మత మార్పిడులను అరికట్టవచ్చన్నారు.
అనంతరం అర్చక సమాఖ్య అధ్యక్షుడు వైపీ ఆంజనేయులు నేతృత్వంలో ఎండోమెంటు సహాయ కమిషనర్ ఆదిశేషు నాయుడిని కలిసి అర్చక సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అర్చక సమాఖ్య ప్రతినిధులు తిరుపతయ్య, శ్రీనివాసులు, మారుతీప్రసాద్, వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు కేవీ రమణబాబు, జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, సభ్యులు గురప్ప, దినేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
యువ రైతు ఆత్మహత్య
విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం వి.కొత్తకోటకు చెందిన కోనంపల్లి రవియాదవ్ (26), కొంత కాలంగా మిర్చి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల సాగుకు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో అప్పులు తీరిపోతాయని భావించాడు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఒక్కసారిగా కుదేలయ్యాడు. కనీసం పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో ఇక అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన రవి యాదవ్.. బుధవారం తెల్లవారుజామున తన ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
కణేకల్లు: మండలంలోని మాల్యం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న హరిజన యల్లప్ప (70) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. వర్షానికి కారుతున్న తన పూరి గుడిసెను మరమ్మతు చేసేందుకు అవసరమైన ఆపు (గడ్డి) కోసుకొచ్చేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామ శివారులోని వంక వద్దకు వెళ్లాడు. గంట తర్వాత ఇద్దరు మనవళ్లు తాతకు తాగునీటి బాటిల్ ఇచ్చేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ యల్లప్ప కనిపించలేదు. దీంతో పిల్లలు ఇంటికెళ్లి విషయాన్ని తమ తండ్రి రమేష్‌కు తెలపడంతో ఆయన అక్కడకు చేరుకుని పరిశీలించారు.
అక్కడ అచేతనంగా పడి ఉన్న యల్లప్పను గమనించి వెలికి తీశాడు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా నిర్దారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, ఆపు కోస్తున్న సమయంలో నీళ్లలో నుంచి విద్యుత్ ప్రసారం జరిగి మృతి చెందాడా? లేక, గుండెపోటుతోనా? వడదెబ్బతోనా అనే అనుమానాలు వ్యక్తం కాగా పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

యువ రైతు ఆత్మహత్య

వ్యక్తి అనుమానాస్పద మృతి