
ఇన్ సర్వీస్ టీచర్లపై వివక్ష వీడాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రస్తుతం చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో ఇన్ సర్వీస్ టీచర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు మండిపడ్డారు. వివక్షను వీడాలంటూ బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నీలూరి రమణారెడ్డి, ఎస్.రామాంజనేయులు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన సౌకర్యం ప్రకారం ఉన్నత ప్రమోషన్ కోసం ఇన్‌సర్వీస్‌లో బీఈడీ చేయడం ఉపాధ్యాయుల హక్కు అన్నారు. 8 ఏళ్లు పూర్తయిన వారికి, రేషనలైజేషన్ గురైన వారికి ప్రస్తుత బదిలీల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల స్థానాల్లో మిగులు టీచర్లు, ఎంటీఎస్ ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ నాయకులు సురేష్‌కుమార్, మల్లికార్జున, ఉపాధ్యాయులు రామన్న, ఓబన్న, ఆదినారాయణ, మురళి, సుమలత, సరోజబాయి, పెద్దన్న, మేరీలత, చంద్రశేఖర్, మహేష్, మహాలక్ష్మి ఉన్నారు.
డ్రోన్ వినియోగంపై దృష్టి సారించండి : డీడీహెచ్
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలుగా డ్రోన్‌లను వినియోగించేలా రైతుల్లో అవగాహన పెంచాలని ఉద్యానశాఖ అధికారులకు ఆ శాఖ డీడీ జి.ఫిరోజ్‌ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో సూపరెండెండెంట్ బాషా, టెక్నికల్ హెచ్‌ఓ రత్నకుమార్, ఉద్యానాధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఉద్యాన రంగం పురోభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినందున వాటి ఫలాలు రైతులకు అందేలా క్షేత్రస్థాయిలో హెచ్‌ఓలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. డ్రోన్ వినియోగంపై ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద గార్లదిన్నె మండలం ముకుందాపురం రైతులను చైతన్య పరిచినట్లు తెలిపారు. హంద్రీ–నీవా కాలువ వెంబడి ఉద్యాన పంటల పెంపకం ప్రోత్సహించాలన్నారు. అలాగే హెచ్చెల్సీ వెంబడి కూడా కొబ్బరి, వెదురు, అరటి, మునగ లాంటి పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. అరటి, మామిడి పండ్లకు వాడే కవర్లు రాయితీతో అందించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ, వాడకంలో కూడా రైతులకు మేలు జరిగేలా చూడాలని ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి సూచించారు.