
విశిష్ట వేడుకకు వేళాయె
రాయదుర్గం టౌన్: విశిష్ట వేడుకకు స్థానిక కోట ప్రాంతంలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకూ కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం ఈ నెల 15న గురువారం నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేదా 9 ఏళ్ల మైనర్ బాలికతో శ్రీవారి వివాహం జరిపించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. నిశ్చితార్థం మొదలు కల్యాణం వరకూ అన్ని శాస్త్రబద్దంగా పురోహితుల మంత్రోచ్చరణల మధ్య జరిగే వివాహ తంతు దాదాపు 60 ఏళ్ల క్రితం పద్మశాలియ వంశస్తుల ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది. ఏటా పద్మశాలియ వంశంలో అరవ తెగకు చెందిన బాలికతో వివాహం జరిపిస్తుంటారు. ఈ నెల 15న గురువారం 11.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవానికి పండితులు ముహూర్తం నిర్ణయించారు. అరవా శ్రీనివాసులు, శ్వేత దంపతుల కుమార్తె శ్రీధన్యతో శ్రీవారి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలో భాగంగా పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక మిటీ సభ్యులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (శ్రీధన్య)ను ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పెళ్లి కుమార్తెను అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లి వేద మంత్రోచ్ఛరణలతో వివాహం జరిపిస్తారు.
నేడు ప్రసన్న వేంకటరమణస్వామి కల్యాణోత్సవం
తొమ్మిదేళ్ల మైనర్ బాలికతో శ్రీవారి వివాహ ఘట్టం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్తయిన ఏర్పాట్లు