
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
గార్లదిన్నె: ‘వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. ఇప్పటికే ఐదు, ఆరు సార్లు అర్జీలిచ్చాం. ఇప్పటికై నా పట్టించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’ అంటూ పలువురు అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం గార్లదిన్నె మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్‌కుమార్‌తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, డీఆర్‌ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జున, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 360 వినతులు అందాయి. అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పదే పదే వస్తున్న అర్జీలను పరిష్కరించే బాధ్యతను జేసీకి అప్పజెబుతామని, ఇందులో అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. గ్రామ, క్షేత్ర స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అమర జవాన్ ‘అగ్నివీర్ మురళీ నాయక్’కు ఘన నివాళులర్పించారు.
వినతుల్లో కొన్ని...
● చీనీ మార్కెట్ యార్డులో ఈ నామ్ వ్యవస్థను రద్దు చేసి వేలం ద్వారా అమ్మకాలు జరపాలని, సూట్ విధానం రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారాజు నాయకులు చెన్నారెడ్డి, ఓబిలేసు, సంగప్ప విన్నవించారు.
● గార్లదిన్నె నుంచి మర్తాడు, కోటంక వరకు తారు రోడ్డు అధ్వానంగా ఉందని, నూతనంగా రోడ్డు వేయాలని ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ఆయా గ్రామస్తులు కోరారు.
● కొప్పలకొండ గ్రామంలో సీసీ రోడ్డుపై రాకపోకలు సాగించకుండా ఓ వ్యక్తి ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు అడ్డు పెడుతున్నారని గ్రామానికి చెందిన నాగరాజు విజ్ఞప్తి చేశాడు.
● గార్లదిన్నె డిప్యూటీ తహసీల్దార్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, డబ్బు ఇస్తేనే పనులు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.
● ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించి, అవమానాలకు గురి చేస్తోందని, న్యాయం చేయాలని కనంపల్లికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త కలెక్టర్‌కు విన్నవించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల వేడుకోలు
వివిధ సమస్యలపై 360 వినతులు
ఈమె పేరు సుబ్బమ్మ. గార్లదిన్నె మండలం శిరివరంవాసి. ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. పది సంవత్సరాల క్రితం సుబ్బమ్మ భర్త చనిపోయాడు. కుమారుడు రేవంత్‌కు పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. సదరం క్యాంపులో 100 శాతం వైకల్యం ఉందని సర్టిఫికెట్ మంజూరు చేశారు. ప్రభుత్వం పింఛన్ రూ.6 వేలే అందిస్తోంది. సుబ్బమ్మ కుటుంబానికి భూమి లేదు. రోజూ కూలీ పనులకెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ఈ క్రమంలో కుమారుడికి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని సుబ్బమ్మ పలుమార్లు మండల అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో గార్లదిన్నెలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించింది.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అధికారులు, ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలోనూ సరిపడా ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో టెంట్ల కింద ఉక్కపోతతో నలిగిపోయారు. పేపర్లను ఊపుకుంటూ ఉపశమనం పొందారు.

అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి