
ప్ర‘గతి’ తప్పిన హెచ్చెల్సీ
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)ను ప్రాజెక్టును కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించే ఈ బృహత్తర ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అధికారిని నియమించకపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో హెచ్చెల్సీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్‌ఈ)గా పనిచేసిన రాజశేఖర్ పదవీ కాలం ముగియడంతో గత నెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ చేశారు. కీలకమైన ఖరీఫ్ సీజన్ ఆరంభం కానున్న ప్రస్తుత తరుణంలో ఉన్నతాధికారి పోస్టు భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కనీసం ఇన్‌చార్జ్ ఎస్‌ఈ నియామకంపై కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే దాదాపు రూ.30 కోట్లకు పైగా నిధులతో కల్వర్టులు, శిథిలావస్థకు వచ్చిన తూముల మరమ్మతులు జరుగుతున్నాయి. వీటిని పర్యవేక్షించి పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాల్సిన జిల్లా స్థాయి అధికారి నియామకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అభివృద్ధి పనులు గతి తప్పాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మరమ్మతులకు మంచి అవకాశం
జిల్లాకు వరదాయినిగా ఉన్న హెచ్చెల్సీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు అందుతోంది. హెచ్చెల్సీ పరిధిలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులకు ఆదాయ మార్గాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎస్‌ఈ స్థాయి అధికారులు సైతం ఇక్కడ పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. ఈసారి నైరుతీ రుతుపవనాలు తొందరగానే పలకరిస్తాయని శాస్త్రవేత్తలూ పేర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే తుంగభద్ర డ్యాం ద్వారా ఈ సారి భారీగా నీరు అందే అవకాశమూ ఉంది. ఇలాంటి కీలక సమయంలో కాలువ మరమ్మతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి 100 కిలోమీటర్ల వరకూ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంది. ఆ తర్వాత పులివెందుల వరకూ నీటిని అందించాలంటే కాలువ పటిష్టత మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాలువలో మరమ్మతులు, ముళ్ల కంపలు తొలగించడానికి నీటి ప్రవాహం లేని ప్రస్తుత తరుణమే మంచి అవకాశమని పేర్కొంటున్నారు.
అతిథి గృహంలోనే విధులు
జిల్లా కేంద్రంలో హెచ్చెల్సీ కార్యాలయానికి దిక్కు లేకుండా పోయింది. గతంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఉన్న కార్యాలయం ప్రభుత్వాసుపత్రికి కేటాయించడంతో అక్కడున్న కార్యాలయాన్ని దశాబ్దాల క్రితం కిత్రం నిర్మించిన అతిథి గృహానికి మార్చారు. హెచ్చెల్సీకి నూతన కార్యాలయం నిర్మాణం ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో రెండేళ్లుగా అతిథిగృహం ఇరుకు గదుల్లోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి హెచ్చెల్సీకి పూర్వవైభవం కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో నిర్వీర్యమవుతున్న బృహత్తర ప్రాజెక్ట్
కనీసం ఇన్‌చార్జ్ ఎస్‌ఈని నియమించని కూటమి సర్కార్
నానాటికీ ప్రశ్నార్థకమవుతున్న ఆయకట్టు సాగు