
తీర్థ యాత్ర పేరుతో దగా
అనంతపురం: తీర్థ యాత్రల పేరుతో తమను మోసం చేశాడంటూ అనంతపురానికి చెందిన ఉదయ్‌శంకర్‌పై పోలీసులకు పలువురు యాత్రికుల తరఫున అనంతపురానికి చెందిన విశ్రాంత లెక్చరర్ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురానికి చెందిన ఉదయ్‌శంకర్ ట్రావెల్స్‌కు చెందిన ఉదయ్‌శంకర్ చార్‌ధామ్ యాత్ర పేరుతో 90 మందిని ఓ బృందంగా చేసి విమానం ద్వారా డెహ్రాడూన్‌కు తీసుకెళ్లాడు. ఇందులో విమాన టికెట్‌కు రూ.10 వేలు పోను మిగిలిన రూ.59వేలు యాత్రకని తెలిపి ఒక్కొక్కరి నుంచి రూ.69 వేలు చొప్పున వసూలు చేశాడు. డెహ్రాడూన్ నుంచి హరిద్వార్‌కు వాహనాల ద్వారా తీసుకెళ్లాడు. హరిద్వార్‌లో రాత్రి వసతి, భోజనం ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు ఉదయం అల్పాహారం అనంతరం బద్రీనాథ్‌కు వెళ్లే క్రమంలో వాహనంలోకి యాత్రికులను ఎక్కించి పత్తా లేకుండా పోయాడు. ఆ సమయంలో ఉదయ్‌శంకర్‌కు యాత్రికులు ఫోన్ చేస్తే హెలికాప్టర్ మాట్లాడే పనిలో ఉన్నానని తెలిపాడు. యాత్రికులను బకాయి మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లించమని కోరాడు. దీంతో అందరూ ఫోన్ పే ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, అందుబాటులో లేకుండా పోయాడు. ఆ సమయంలో దిక్కు తోచని యాత్రికులు ఎలాగోలా ఇబ్బంది పడుతూ డబ్బు సర్దుకుని స్వస్థలాలకు చేరుకున్నారు. కనీసం విమాన తిరుగు ప్రయాణ టికెట్లను సైతం ఉదయ్‌శంకర్ రద్దు చేసి, ఆ సొమ్మును కూడా దోచేశాడు. తమను మోసం చేసిన ఉదయ్‌శంకర్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేకూర్చాలంటూ అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు చెందిన యాత్రికుల తరఫున తాను ఫిర్యాదు చేస్తున్నట్లు అనంతపురం రెండో పట్టణ సీఐ క్రాంతికుమార్‌తో విశ్రాంత లెక్చరర్ సత్యనారాయణ పేర్కొన్నారు.