
మీ సేవ కేంద్రంలోని కంప్యూటర్‌లో తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
● విజిలెన్స్ సోదాలతో వెలుగులోకి
కళ్యాణదుర్గం: పట్టణంలోని రెండు మీ సేవ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన సోదాల్లో రెండు చోట్లా అక్రమాలు బయటపడ్డాయి. ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు సీఐలు సాయిప్రసాద్, రామారావు నేతృత్వంలో బుధవారం చైత్ర ‘మీ సేవ’ కేంద్రం, శ్రీ బసవ ‘మీ సేవ’ కేంద్రంలో సోదాలు చేశారు. నకిలీపత్రాల జారీకి అవసరమైన సీళ్లు, ఖాళీ ఒరిజినల్ రైస్ కార్డులు, కలరు నకలు కాపీలు, సంతకం చేసిన ఖాళీ నాన్– జ్యుడీషియల్ బాండ్ పేపర్లు ఉండటం, ఇతరులకు చెందిన ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు లభించాయి. ఒక్కరికి కేటాయించిన మీ సేవ కేంద్రాన్ని మరొకరు నడపడం, ఇతరుల సీళ్లు, పత్రాలు కలిగి ఉండటం, రిజిష్టర్లు అప్‌డేట్ చేయకపోవడం, అర్జీదారుల పేర్లను ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేయడం వంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. రెండు మీ సేవ కేంద్రాల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనంతరం చైత్ర మీ సేవ కేంద్రంపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేయించారు. తనిఖీల్లో డీఈఈ యోగేష్‌బాబు, ఏఓ వాసు ప్రకాష్, ఏఈఈలు రవీంద్ర, కుళ్లాయిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, వెంకటేష్ పాల్గొన్నారు.
● ఇదిలా ఉండగా తమ కేంద్రంలో తనిఖీలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఓ టీడీపీ నేత విజిలెన్స్ అధికారులపై చిందులేసినట్లు తెలిసింది. ‘మీకు ఇష్టం వచ్చినట్లు తనిఖీ చేసుకోండి.. నేను కోర్టులో తేల్చుకుంటా’ అంటూ చిరుబుర్రులాడుతూ అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం.