
రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్
ఉరవకొండ: పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన ఉరవకొండ అర్బన్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డుల పరిశీలన అనంతరం వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను గమనించి త్వరగా వేలం వేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో క్రైం రేటు తగ్గిందన్నారు. చోరీలు కూడా పూర్తిగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఏరియాలోనూ సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచి వారి కేసులను కూడా పరిష్కరించేలా చూడాలన్నారు. ముఖ్యంగా స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా మట్కా, జూదం, బియ్యం అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రజలు తన సెల్ నంబర్ (94407 96800)కు సమాచారం తెలపాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ హరినాథ్, ఎస్‌ఐ వెంకటస్వామి పాల్గొన్నారు.
పోలీసులకు యోగా తప్పనిసరి
అనంతపురం క్రైం: శారీరకంగానే కాదు మానసికంగా కూడా పోలీసులు దృఢంగా ఉండాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సూచించారు. పోలీసులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ప్రతి బుధవారం యోగా చేయాలని సూచించారు. అందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో సిబ్బందితో యోగా చేయించారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో అనంతపురం అర్బన్‌తో పాటు రూరల్ పోలీస్ సబ్ డివిజన్ల పోలీసు సిబ్బందికి యోగా మాస్టర్లు చలపతి, దీపా పలు ఆసనాలపై శిక్షణ ఇచ్చారు. ఇక్కడ వేయిస్తున్న ఆసనాలను జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మిగతా పోలీసు సిబ్బంది అనుసరించి యోగా చేశారు. సిబ్బంది పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యం కాపాడుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, ఏఆర్ డీఎస్పీ మునిరాజ్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
శాంతి కమిటీలతో సమస్యల పరిష్కారం
అనంతపురం క్రైం: గ్రామాల్లో శాంతిభద్రతలతో పాటు ఇతర సమస్యలను శాంతికమిటీల ద్వారా పరిష్కరించాలని ఎస్పీ అన్బురాజన్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ప్రజలందరూ అన్నదమ్ముల్లా జీవించేలా కృషి చేయాలన్నారు. పోలీసు విభాగానివే కాకుండా ఇతర విభాగాల సమస్య అయినా సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజలు అందరూ ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, అభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు. ఏ గ్రామంలోనైనా సమస్యలుంటే తన నంబర్ 94407 96800కు తెలియజేయాలని, వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు.