
మాట్లాడుతున్న ఉమాపతి
● వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి
అనంతపురం కార్పొరేషన్: కుప్పం ఎమ్మెల్యే, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ చట్టబద్ధంగానే సాగిందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఇటీవల జిల్లా న్యాయస్థానం ఎదుట టీడీపీ లీగల్ సెల్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆయన ఖండించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులతో కలసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు కేసులో బెయిల్ వేసే అధికారం ఉన్నా ఆ దిశగా పిటీషన్ దాఖలు చేయకుండా న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించాలనుకోవడం టీడీపీ లీగల్ సెల్ నాయకులకు భావ్యం కాదన్నారు. స్కిల్ స్కాంను సీఐడీ తరపున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి కొందరు బెదిరింపు కాల్స్ చేయడంతో పాటు టీవీ 5 డిబెట్‌లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లోనే పొన్నవోలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టుంగులు పెట్టడం సరికాదన్నారు. కాపుల భవిష్యత్తు కోసం పార్టీని స్థాపించిన పవన్‌కళ్యాణ్ ఈ రోజు అదే కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించడం సిగ్గుచేటన్నారు. కాపు ఉద్యమకారుడు, తునిలో 50 లక్షల మందిని కలిపిన ముద్రగడ్డ పద్మనాభాన్ని పోలీసులు అరెస్టు చేసి, వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేనకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, నాయకులు వెంకట్రాముడు, నాగిరెడ్డి, ఇలియాజ్ అహమ్మద్, సుబ్బేనాయక్, మహబూబ్‌ఖాన్, గోకుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘ఇన్‌స్పైర్’ నామినేషన్లు వేగవంతం చేయండి
● జిల్లా విద్యాశాఖ అధికారి నాగరాజు
రాప్తాడురూరల్: ‘ఇన్‌స్పైర్ మనక్’ కార్యక్రమానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపాధ్యాయులకు డీఈఓ వి.నాగరాజు సూచించారు. ‘నేషనల్ సైన్స్ కాంగ్రెస్’ అంశంపై శనివారం అనంతపురంలోని సైన్స్ సెంటర్‌లో ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి ఉపాధ్యాయుడూ ఐఎఫ్ ప్యానల్‌తో పాఠాలు బోధించడంలో నైపుణ్యం సాధించాలన్నారు. సైన్స్ ప్రదర్శనకు ఉత్తమమైన ప్రాజెక్టులు సిద్ధం చేయించాలన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జిల్లా సైన్స్ అధికారి బాల మురళీకృష్ణ మాట్లాడుతూ.. సైన్స్ కార్యక్రమాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ విధి విధానాలను రిసోర్స్ ఉపాధ్యాయులు మేడా ప్రసాద్, శామ్యూల్ ప్రసాద్, ఆనంద భాస్కరరెడ్డి, రాము వివరించారు.