నిర్లక్ష్యం ఇ‘లా’ అయితే ఎలా?

- - Sakshi

అనంతపురం: ఏపీ లాసెట్‌ నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరువు ప్రతిష్టలకు మచ్చతెచ్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. లాసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ జ్యోతి విజయ్‌కుమార్‌ను విచారణ చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు గత వారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలోనే ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు. కమిటీలో సభ్యులుగా ఎవరిని నియామకం చేస్తారనే అంశంపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. 2018, 2019, 2020 ఏపీ లాసెట్‌ బాధ్యతను ఎస్కేయూ నిర్వర్తించింది. 2018, 2019లో ఏపీ లాసెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ జ్యోతి విజయకుమార్‌ వ్యవహరించారు. సెట్‌ నిర్వహణకు 2018లో రూ.85 లక్షలు, 2019లో రూ.65 లక్షలు మొత్తం రూ.1.50 కోట్లు అడ్వాన్స్‌ రూపంలో కన్వీ నర్‌కు ఉన్నత విద్యామండలి చెల్లించింది. లాసెట్‌ నిర్వహణ, ప్రశ్నపత్రాల రూపకల్పన, ప్రింటింగ్‌, పరీక్ష కేంద్రాల నిర్వహణ, ఇన్విజిలేటర్ల రెమ్యునరేషన్‌కు చెల్లించిన బిల్లులను ఆడిటింగ్‌ చేసి ఉన్నత విద్యామండలికి అందజేయాలి. ఈ ప్రక్రియ అనంతరం ఏదైనా డబ్బు మిగిలితే ఆ సొమ్మును ఉన్నత విద్యామండలికి వెనక్కి చెల్లించాలి. అయితే ఇప్పటిదాకా బిల్లులు సమర్పించలేదు. ఇప్పటికే ప్రొఫెసర్‌ జ్యోతి విజయ్‌కుమార్‌కు మూడు దఫాలుగా వర్సిటీ అధికారులు మెమోలు జారీ చేశారు. అయినా బిల్లుల సమర్పణలో ప్రొఫెసర్‌ అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తుండడం పలు విమర్శలు దారితీస్తోంది. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి కమిటీ నేరుగా ప్రొఫెసర్‌ జ్యోతి విజయ్‌కుమార్‌ను విచారించి బిల్లులకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా నివేదికను ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు సమర్పించనుంది.

2018 నుంచి వరుసగా మూడేళ్లు ఏపీ లాసెట్‌ నిర్వహణ

లాసెట్‌ కన్వీనర్‌గా ఎస్కేయూ ప్రొఫెసర్‌ జ్యోతి విజయకుమార్‌

2018, 2019లో రూ.1.50 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లింపు

ఇప్పటిదాకా బిల్లులు సమర్పించని వైనం

విచారణ కోసం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కమిటీ

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top