నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.43.10 లక్షలు

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం   - Sakshi

గుంతకల్లు రూరల్‌: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ.43.10 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ వెంకటేశ్వరెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ఆలయంలో చేపట్టారు. 49 రోజులకు గానూ రూ.43,10,744 నగదు, అదేవిధంగా అన్నదాన హుండీ ద్వారా రూ.52,260 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. 0.004 గ్రాముల బంగారు, 1.309 కిలోల వెండిని కానుకల రూపంలో స్వామికి సమర్పించినట్లు పేర్కొన్నారు. పాలకమండలి చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, ఆలయ అధికారులు తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

నిందితులపై నిఘా పెంచండి

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: మాదక ద్రవ్యాల (డ్రగ్స్‌) కేసుల్లోని నిందితులపై నిఘా పెంచాలని ఎస్పీ ఫక్కీరప్ప పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని ఎస్‌ఐ, ఆపై స్థాయి పోలీసు అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాదకద్రవ్యాల కేసులపై సమీక్షించారు. జిల్లాలో 2021 సంవత్సరం నుంచి నమోదైన కేసుల్లో ఉన్న నిందితులను మెయిన్‌ అఫెండర్స్‌, పెడ్లర్స్‌, కంజ్యూమర్స్‌ కేటగిరీలుగా విభజించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలక నిందితులపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణాలో ఆరి తేరిన వారిని గుర్తించి ఆట కట్టించాలని పిలుపునిచ్చారు. గంజాయి, తదితర మాదక ద్రవ్యాలను స్థానికంగా అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ ఇ.నాగేంద్రుడు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఆయా పోలీసు కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల నుంచి పాల్గొన్నారు.

అరిసికెరకు

సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లు

గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అరిసికెరకు సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అఫీసర్‌ సీహెచ్‌ రాకేష్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. సికింద్రాబాద్‌ – అరిసికెర (07233/34) స్పెషల్‌ రైళ్లు మార్చి 30 నుంచి జాన్‌ 30 వరకు శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల, రాయచూర్‌, గుంతకల్లు, ఆదోని, అనంతపురం, ధర్మవరం, యలహంక మీదుగా అరిసికెరకు చేరుతుందన్నారు. అలాగే హైదరాబాద్‌ – అరిసికెర (07265/66) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఏప్రిల్‌ 4 నుంచి జాన్‌ 28 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు ఉంటాయని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్‌, కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తిరోడ్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, అనంతపురం, ధర్మవరం, యలహంక, తుమకూరు మీదుగా అరిసికెరకు చేరుతుందన్నారు.

ముగిసిన ఇంటర్‌

ఫస్టియర్‌ పరీక్షలు

రాప్తాడురూరల్‌: ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ (జనరల్‌) పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు కామర్స్‌, కెమిస్ట్రీ పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 929 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 31,198 మంది విద్యార్థులకు గాను 30,269 మంది పరీక్షలు రాశారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 28,890 మందికి గాను 28,098 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 2,308 మందికి గాను 2,171 మంది హాజరైన వారిలో ఉన్నారు. ఒకేషనల్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు ఉంటాయి.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top