
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మాదకద్రవ్యాల విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఎం.రవిప్రకాష్ ఆదేశించారు. సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రగ్స్ కేసులపై సమీక్షించారు. ప్రధానంగా మాదకద్రవ్యాల (డ్రగ్స్)తయారీ, సరఫరా, విక్రయం, కొనుగోలుతో సంబంధమున్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమర్షియల్ క్వాంటిటీ కేసుల్లో (20 కిలోల కంటే ఎక్కువ మోతాదులో ఉన్న గంజాయి) లోకల్ పెడ్లర్స్‌ను గుర్తించాలన్నారు. వీరికున్న కీలక నిందితులను లింకు చేయాలని, గంజాయి వినియోగించే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడు, అంతకంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉంటే అలాంటి వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు.
ముఖ్య పట్టణాలలో గంజాయి, తదితర మత్తు పదార్థాల అనర్థాలను వివరించే హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలకు వెళ్లి మత్తు పదార్థాలు, అనర్థాలపై కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టి.. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని సూచించాలన్నారు. ఈ కేసుల ఛేదింపునకు బాగా పని చేసిన వారికి రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. చెక్ పోస్టులు, ప్రత్యేక దాడులు నిర్వహించి కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఎస్పీలు డాక్టర్ ఫక్కీరప్ప, రాహుల్‌దేవ్‌సింగ్, రిషాంత్‌రెడ్డి, రేంజ్ పరిధిలో నాలుగు జిల్లాల అదనపు ఎస్పీలు, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల ఎస్డీపీఓలు, నాలుగు జిల్లాల డీసీఆర్బీ సీఐలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల సెబ్ అధికారులు పాల్గొన్నారు.