
అర్జీలు స్వీకరిస్తున్న జేసీ కేతన్‌గార్గ్
అనంతపురం అర్బన్: ‘స్పందన’లో అందే ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపించాలని జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్, డీఆర్‌ఓ గాయత్రీదేవి, ఆర్డీఓ మధుసూదన్, ఆన్‌సెట్ సీఈఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 363 అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని పరిష్కరించాలన్నారు.
అర్జీల్లో కొన్ని..
● సర్వే నంబరు 296/1లో 104 ప్లాట్ నంబరు తనకు కేటాయిస్తూ 2022, సెప్టెంబరు 10న తనకు ఇంటి పట్టా మంజూరైందని, అయితే తనకు ఎటువంటి నోటీసూ ఇవ్వకుండా అదే ప్లాట్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 27న వేరొక వ్యక్తికి పట్టా మంజూరు చేశారని గుంతకల్లు పట్టణం తిమ్మనచర్లకు చెందిన బి.కామేశ్వరి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి తనకు న్యాయం చేయాలని కోరారు.
● అనంతపురం రూరల్ మండలం కురుగుంట సర్వే నంబర్ 320–1లో రెండు సెంట్ల చొప్పున 67 మందికి ప్రభుత్వం ఇంటిపట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ స్థలాలను చదును చేసుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి స్థలం తమదంటూ అడ్డుకున్నాడని లింగమయ్య, గంగాధర్, సరస్వతి, తదితరులు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు.
● తమ సొంత భూమిలో 1.76 ఎకరాలను వేరొకరి పేరున 1బీలో ఎక్కించారని అనంతపురానికి చెందిన తాళ్ల జయకృష్ణ ఫిర్యాదు చేశారు. ముప్పాలగుత్తి గ్రామ పొలంలో వివిధ సర్వే నంబర్లలో 2.67 ఎకరాల భూమిని తన తండ్రి 1982లో కొనుగోలు చేశాడని, ఇందులో 1.76 ఎకరాల భూమిని వేరొకరి పేరున 1బీలో ఎక్కించారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
‘స్పందన’లో 363 వినతులు