
104 వాహనాలను ప్రారంభిస్తున్న అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్
● అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్
అనంతపురం అర్బన్: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అసిస్టెంట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్‌కుమార్ తెలిపారు. జిల్లాకు కొత్తగా మంజూరైన ఆరు 104 వాహనాలను సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ప్రజలకు సత్వర వైద్యం అందించేందుకు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మండలానికి ఓ 104 వాహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. తాజాగా మరో ఆరు వాహనాలను సమకూర్చినట్లు వివరించారు. వీటిని మొబైల్ మెడికల్ చెకింగ్‌కు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వీరబ్బాయి, ఆర్యోశ్రీ కో–ఆర్డినేటర్ కిరణ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి యుగంధర్, డీసీహెచ్‌ఎస్ కృష్ణవేణి, మలేరియా అధికారి ఓబులు, వైద్యాధికారులు అనుపమ, సుజాత, వీరారెడ్డి, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఇరు వర్గాల ఘర్షణ
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో చిన్నపాటి విషయంపై ఆదివారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కర్రలు, కొడవళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో ఈశ్వరయ్య, నాగరాజు, సంజప్ప, మరో వర్గంలోని సుధాకర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
షీప్ యూనియన్ త్రీమెన్ కమిటీ అధ్యక్షుడిగా నరసింహగౌడ్
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల జిల్లా సమాఖ్య (షీప్ అండ్ గోట్ యూనియన్)కు ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం నియమించిన త్రీమెన్ కమిటీ పాలకవర్గం సభ్యు లు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. పర్సన్ ఇన్‌చార్జిగా ఉన్న పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం సమక్షంలో అధ్యక్షుడిగా రాప్తాడు మండలానికి చెందిన పసుపుల నరసింహగౌడ్, సభ్యులుగా పి.ఈశ్వరయ్య, బి.కిష్టప్ప బాధ్యతలు స్వీకరించారు. గొర్రెల సహకార సంఘాలకు ఎన్నికలు జరిగేదాకా... లేదంటే గరిష్టంగా రెండేళ్ల పాటు త్రీమెన్ కమిటీకి అధికారాలు ఉంటాయని డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా నరసింహగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మంగళవారం జిల్లా యూనియన్ సమావేశం ఉంటుందని పర్సన్ ఇన్‌చార్‌జ్జ్ డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ గోల్డ్‌స్మన్ తెలిపారు.
ఫార్మా–డీ ఫస్టియర్ సప్లి ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన ఫార్మా–డీ మొదటి సంవత్సరం (ఆర్–17) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఇ.కేశవరెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.

డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం సమక్షంలో బాధ్యతలు తీసుకుంటున్న పసుపుల నరసింహగౌడ్