
తాడిపత్రి అర్బన్: జీవిత బీమా చేసిన వ్యక్తి బతికుండగానే మరణించినట్లు తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి పరిహారం మొత్తాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను తాడిపత్రి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ వీఎన్‌కే చైతన్య పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆనందరావు, ఎస్‌ఐ ధరణీబాబుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. తాడిపత్రి పట్టణంలోని హరిజనవాడకు చెందిన గిత్త రంగనాయకులు భారతి యాక్స్ జీవిత బీమా కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తుండేవాడు. అదే కంపెనీలో పట్టణానికి చెందిన బండి శాంతమ్మ రూ.20 లక్షలకు జీవిత బీమా చేసింది.
విషయం తెలుసుకున్న గిత్త రంగనాయకులు, తాడిపత్రి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన నారాపురం గురుశేఖర్, చింతలయ్య గారి రంగనాయకులు, చంద్రశేఖర్, గుడిపాటి గౌస్‌పీర్ సహకారంతో నకిలీ డెత్, ఫ్యామిలీ, డాక్టర్ సర్టిఫికెట్లు సృష్టించారు. పాన్, ఆధార్ కార్డులలో ఫొటో మార్ఫింగ్ చేసి బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించారు. బండి శాంతమ్మకు చెందిన రూ.20 లక్షల బీమా మొత్తాన్ని కాజేసేందుకు పథకం పన్నారు. విచారణకు వచ్చిన సదరు బీమా సంస్థ అధికారులకు బండి శాంతమ్మ బతికే ఉందన్న విషయం తెలిసి కంగుతిన్నారు.
విషయం తెలుసుకుని బాధితురాలు సోమవారం రాత్రి పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి బీమా మొత్తాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన ఐదుగురినీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కంప్యూటర్లు, నకిలీ సీళ్లతో పాటు నకిలీ సర్టిఫికెట్లు, ఆర్‌కే ఆసుపత్రికి చెందిన వైద్యుడు రామకేశవరెడ్డి పేరుతో ఉన్న లెటర్‌హెడ్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.