
అనంతపురం అగ్రికల్చర్: త్వరలో జిల్లా వ్యాప్తంగా 26 పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) బి.చంద్రానాయక్ తెలిపారు. రబీలో రైతులు పండించిన పప్పుశనగను ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటా రూ.5,335తో ఆర్‌బీకే వేదికగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఈసారి ఎకరాకు ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ల వరకు పంట దిగుబడులు వచ్చాయన్నారు. ఇప్పటికే సీఎం యాప్‌లో 1600 మంది వరకు పప్పుశనగ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ–క్రాప్ డేటా ఆధారంగా 20 వేల మెట్రిక్ టన్నుల వరకు పప్పుశనగ సేకరణకు అనుమతి ఉందన్నారు.
జొన్నల విక్రయానికి సంప్రదించండి
జొన్నలు విక్రయించదలచిన రైతులు ఆర్‌బీకేల్లో సంప్రదించాలని డీఏఓ సూచించారు. క్వింటా కనీస మద్దతు ధర రూ.2,970 ప్రకారం అమ్మిన వెంటనే నగదు చెల్లింపు చేస్తామని తెలిపారు. రానున్న ఖరీఫ్‌లో చిరుధాన్యపు పంటల విస్తీర్ణం పెంపునకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. చిరుధాన్యాలు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
రెండో విడతగా 232 ఆర్‌బీకేలకు అనుబంధంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ) వచ్చే నెలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.