వీడిన జంట హత్యల మిస్టరీ | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 21 2023 10:26 PM

నిందితుల అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నర్సింగప్ప    - Sakshi

గుంతకల్లు: పట్టణంలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి పంపకాల నేపథ్యంలోనే భూస్వామి జీపీ హేమకోటిరెడ్డి, అడ్డుకోబోయిన ఆయన డ్రైవర్‌ హత్యకు గురైనట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురితోపాటు హత్యకు సహకరించిన మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నర్సింగప్ప టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐలు గణేష్‌, రామసుబ్బయ్యతో కలిసి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 14న భూస్వామి జీపీ హేమకోటిరెడ్డి, ఆయన డ్రైవర్‌ షేక్షావలి హత్యకు గురయ్యారు.

ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు డీఎస్పీ నరసింగప్ప ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. నలుగురు సీఐలు, ఎస్‌ఐలతో కలిపి ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ కేసులో నిందితులైన తొమ్మిది మంది సోమవారం ఉదయం గుత్తి సమీపంలోని ఎన్‌హెచ్‌–44లో ఉన్న బాట సుంకులమ్మ గుడి వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక పల్సర్‌ ద్విచక్ర వాహనం, హత్యకు ఉపయోగించిన పిడి బాకు, కాల్చి వేసిన సీసీ టీవీ ఫుటేజ్‌ల హార్డ్‌ డిస్క్‌ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తి పంపకాల వివాదమే..
హేమకోటిరెడ్డి హత్యకు ప్రధాన కారణం ఆస్తి పంపకాల్లో తలెత్తిన వివాదమేనని విచారణలో వెల్లడైంది. మూడు దశాబ్దాలుగా హేమకోటిరెడ్డి, సుధాకర్‌రెడ్డి మధ్య ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. పాతగుంతకల్లుకు చెందిన జీపీ కేశవరెడ్డి, మంతకల్లురెడ్డి అన్నదమ్ములు. కేశవరెడ్డికి ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డితోపాటు మాలతి సంతానం కాగా.. మంతకల్లురెడ్డికి భాస్కర్‌రెడ్డి, హేమకోటిరెడ్డి, నీలకంఠరెడ్డి సంతానం. ఈ కుటుంబాల మధ్య ఆస్తి వివాదాల్లో అనేక క్రిమినల్‌ కేసులతోపాటు కోర్టులో కేసులు కూడా నడుస్తూనే ఉన్నాయి. వీరిలో నీలకంఠరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి చనిపోయారు. ఇక మిగిలిన హేమకోటిరెడ్డి, సుధాకర్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

సుధాకర్‌రెడ్డి గుంతకల్లు వదిలి తెలంగాణలోని మక్తల్‌ గ్రామానికి మకాం మార్చాడు. అక్కడే హోటల్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. హేమకోటిరెడ్డిని ఎలాగైనా చంపాలని వైఎస్సార్‌ జిల్లా రమణపల్లికి చెందిన చిట్టిబాబుకు ఒకసారి, మరోసారి పాతగుంతకల్లుకు చెందిన బోయ ప్రసాద్‌కు, ఇంకోసారి గుంతకల్లులోని ఆలూరు రోడ్డుకు చెందిన మోసిన్‌, అనంతపురానికి చెందిన హనీఫ్‌, తాడిపత్రి రావివెంకటాంపల్లికి చెందిన కృష్ణయ్యలకు సుపారీలు ఇచ్చి.. ఫెయిలయ్యాడు. గత జనవరి 19న సుధాకర్‌రెడ్డి చనిపోయాడు. దీంతో సుధాకర్‌రెడ్డి భార్య సుగుణ, కొడుకు భరతసింహారెడ్డిలు హేమకోటిరెడ్డి హత్యకు పథకం పన్నారు.

15 రోజులుగా రెక్కీ..
హేమకోటిరెడ్డిని చంపాలని 15 రోజులుగా పక్కా రెక్కీ నిర్వహించారు. భరత్‌సింహారెడ్డితోపాటు ఈయన తల్లి సుగుణమ్మ, మేనమామలు దేవేందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వారి రెస్టారెంట్‌లో పనిచేసే దీపం సుబ్బరాయుడు, ఈడిగ ప్రకాష్‌గౌడ్‌తో హత్యకు ప్రణాళిక రచించారు. హేమకోటిరెడ్డి ఇంటి సమీపంలోనే తిరుగుతూ ఆయన కదలికలపై నిఘా పెట్టారు. వీరికి మక్తల్‌కు చెందిన చెండేపల్లి దేవేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి చెల్లెలు మాలతి (దూదేకుల మాబు (లేట్‌)ను ప్రేమ వివాహం చేసుకుంది), ఈమె కుమారుడు అబ్దుల్లాతోపాటు మల్లేనుపల్లికి చెందిన వడుగూరు గోవిందప్ప సహకరించారు. ఈ నెల 14న హేమకోటిరెడ్డి ఇంటి బయట భరతసింహారెడ్డి, సుబ్బరాయుడు, ప్రకాష్‌గౌడ్‌లు మాట్లాడుకున్నారు. తర్వాత ఇంట్లోకి భరత్‌సింహారెడ్డి, సుబ్బరాయుడు వెళ్లారు. ప్రకాష్‌గౌడ్‌ బయటే ఉండి పరిస్థితులు గమనిస్తున్నాడు. ఇంట్లోకి వెళ్లిన భరతసింహారెడ్డి తాను కేశప్ప మనవడినని, ఆస్తి పత్రాలపై సంతకాలు చేయాలంటూ చెప్పడంతో హేమకోటిరెడ్డి బెదిరించాడు. మొండికేసిన హేమకోటిరెడ్డిని పిడి బాకుతో పొడిచాడు. అదే సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన డ్రైవర్‌ షేక్షావలిని కూడా చంపి పారిపోయారు.

ఈ హత్యలతో సంబంధం ఉన్న ఈ తొమ్మిది మందితోపాటు గతంలో సుధాకర్‌రెడ్డి సుపారీలు ఇచ్చిన మరో ఆరుగురిపై (పరారీలో ఉన్నారు) కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోని నిందితుల్లో తొమ్మిది మందిని సోమవారం ఉదయం గుత్తి సమీపంలోని ఎన్‌హెచ్‌–44లో అరెస్ట్‌ చేశారు. వీరిని మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన టూటౌన్‌ సీఐ గణేష్‌, వన్‌టౌన్‌ సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ తిరుపాల్‌, ఏఎస్‌ఐలు శాంతిరాముడు, పద్మావతి, హెడ్‌ కానిస్టేబుళ్లు శివప్రసాద్‌, శంకరయ్య, వెంకటేష్‌, బాబామున్వర్‌ వై.ఓబుళపతి, కానిస్టేబుళ్లు చిరంజీవి, ఎర్రిస్వామి, బాబు, మురళిలను డీఎస్పీ అభినందించారు.

Advertisement
Advertisement