మూగ వేదన! | - | Sakshi
Sakshi News home page

మూగ వేదన!

May 4 2026 7:13 AM | Updated on May 4 2026 7:13 AM

మూగ జీవాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందకపోవడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. సిబ్బంది కొరత, పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

సాక్షి, అనకాపల్లి: జిల్లాలో పాడి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లక్షల రూపాయలు పోసి కొనుగోలు చేసిన పశువులకు జబ్బు చేస్తే, ప్రాణాలు కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. పశువైద్యశాలలు ఉన్నా వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. మందులు వేయడానికి సిబ్బంది కరువయ్యారు. ఫలితంగా జిల్లాలోని లక్షలాది జీవాలకు సరైన వైద్యం అందక ‘మూగ వేదన’ అనుభవిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాడి పశువులకు ఏదైనా అత్యవసరమైతే 1962 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌చేస్తే సిబ్బంది పాడి పశువు దగ్గరకే వచ్చి వైద్యం అందించి వెళ్లే పరిస్థితులుండేవి. కానీ చంద్రబాబు సర్కార్‌లో ఆ సేవలను నిలిపివేయడమే కాకుండా పాడి పశువుల అనారోగ్యం బారిన పడితే వైద్యం చేసేవారే కరువయ్యారు. క్షేత్రస్థాయిలో వెటర్నరీ సిబ్బంది లేకపోవడంతో భారమంతా గోపాలమిత్రలపైనే పడుతోంది. జిల్లాలో 24 మండలాలు పరిధిలో మొత్తం 67 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు 9 ఖాళీ ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టులు 48 గానూ 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వైద్యులు కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటు ఉండడం లేదు. పూర్తిస్థాయి సిబ్బంది లేక జిల్లాలో చాలా పశువైద్యశాలలు తెరుచుకోని పరిస్థితి దాపురించింది. కుసర్లపూడి, ఎం.కోడూరు, కె.జె.పురం, బూరుగుపాలెం, వడ్డాది, నాతవరం, కోరుప్రోలు, ఏటికొప్పాక ప్రాంతాల్లో గల పశువైద్యకేంద్రాల్లో వెటర్నరీ అసిస్టెంటు సర్జన్‌ పోస్టులు రెండేళ్లుగా ఖాళీగానే ఉండటంతో ఈప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 24 కేంద్రాల్లో వెటర్నరీ అసిస్టెంటు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించకపోవడంతో పశువులకు ఎలాంటి వైద్య సేవలు పొందాలన్న గోపాలమిత్రలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వెటర్నరీ లైవ్‌స్టాక్‌ ఆఫీసర్లు లైవ్‌స్టాక్‌ అసిస్టెంటు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నాతవరం మండలంలో నాతవరం, గునుపూడి, శృంగవవరం ప్రాంతాల్లో పశువైద్యశాలలు ఉన్నాయి. గునుపూడి, నాతవరం పశువైద్యాశాలల్లో వైద్యులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడూ మూసే ఉంటున్నాయి. శృంగవరం పశువైద్యశాలలో వైద్యులు ఉన్నా ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదని రైతులు చెబుతున్నారు.

పాల ఉత్పత్తిపై ప్రభావం

పశువులకు గాయాలు కావడం సర్వసాధారణం. వాటికి సకాలంలో చికిత్స చేయకపోవడంతో పెద్ద ప్రమాదంగా మారింది.చిన్నగాయాలు కూడా ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తున్నాయి. దీనికి తోడు మినరల్‌ ఇంజక్షన్లు సకాలంలో వేయకపోవడంతో పశువులు బలహీనంగా మారి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు.

సత్వర చర్యలు అవసరం

జిల్లాలో పశుగ్రాసం కొరత ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు పశువులకు వైద్యం అందకపోవడం రైతులను కుంగదీస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తిస్థాయిలో పశువైద్యాధికారులు, సిబ్బంది లేక పాడి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా గ్రామాల్లో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందక వేలాది రూపాయల విలువ చేసే పశువులు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో రైతులకు పశువైద్యశాలల ద్వారా పశుగ్రాసం విత్తనాలు రాయితీపై సరఫరా చేసేవారని, లేగదూడలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు వేసేవారని ఇటీవల కాలంలో ఆ సేవలు అందడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా యంత్రాంగం సత్వరం స్పందించి, ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బంది పోస్టులను భర్తీచేయాలని, మొబైల్‌ వెట ర్నరీ యూనిట్ల ద్వారా మారుమూల గ్రామా లకు సేవలు అందించాలని రైతులు కోరుతున్నారు.

భారమంతా గోపాలమిత్రల పైనే..

పశువైద్య సిబ్బంది లేకపోవడంతో, ఆ భారం మొత్తం గోపాలమిత్రలపై పడుతోంది. వ్యాక్సినేషన్‌ నుంచి కృత్రిమ గర్భధారణ వరకు అన్ని పనులూ వారే చేయాల్సి వస్తోంది. పని ఒత్తిడి పెరగడంతో సేవల నాణ్యత దెబ్బతింటోందని, సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

జిల్లాలో పడకేసిన పశువైద్యం

వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది కొరతతో

కుదేలవుతున్న పాడి పరిశ్రమ

అరకొరగా వైద్య సేవలు..

ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలు

క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక

గోపాలమిత్రలపై భారం

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో మొత్తం 446 ఆర్‌ఎస్‌కేల పరిధిలో 198 వెటర్నరీ క్లస్టర్లు ఉన్నాయి. వాటిలో సుమారు 82 వరకు పోస్టులు ఖాళీగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పశువులకు వైద్యం సేవలు లభించడం కష్టమవుతోంది. రైతులు వ్యవసాయం తర్వాత పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అధికార గణాంకాల ప్రకారం జిల్లాలో ఆవులు 1.87 లక్షలు, గేదెలు 2.3 లక్షలు, మేకలు, గొర్రెలు 3.9 లక్షలు, పందులు 10వేల వరకు ఉన్నాయి. వీటితో పాటు 49 లక్షల కోళ్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement