కలెక్టర్ బంగ్లా ఎదురుగా కలప దొంగలు
యూకలిప్టస్ తోటను నరికేసిన టీడీపీ నాయకుడు
కలప తరలించినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు
కలెక్టర్ బంగ్లా ఎదురుగా ప్రభుత్వ భూమిలో రూ.20 లక్షల విలువైన యూకలిప్టస్ తోట
తుమ్మపాల:
కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల అక్రమాలకు హద్దులు లేకుండా పోతుంది. అందిన కాడికి దోచేయడమే పనిగా పావులు కదుపుతున్నారు. అధికారులు లేని సమయాల్లో అక్రమాలకు తెగబడుతున్నారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు కలెక్టర్ విజయ కృష్ణన్ వెళ్లడంతో ఆమె నివాసముండే బంగ్లా ఎదురుగా తోటలను సైతం టీడీపీ నాయకులు విక్రయించేశారు. మండలంలో కోడూరు సర్వే నెం.45 ప్రభుత్వ భూమిలో కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో దట్టమైన చిట్టడివిని తలపించేలా అత్యంత దట్టమైన యూకలిప్టస్ తోట ఉంది. దీని ఽప్రస్తుత మార్కెట్ ధర రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. గత కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు ఆ తోటను పరిరక్షిస్తున్నారు. కొంతకాలం క్రితం టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ కన్ను ఆ తోటపై పడింది. గతంలోనూ అతను ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అనేకసార్లు అడ్డుకున్నారు. కలెక్టర్ లేకపోవడం, ఈనెల 20న సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన కోసం మిగిలిన అధికారులు బిజీబిజీగా ఉండడంతో ఆ టీడీపీ నేత రంగంలోకి దిగిపోయారు.
ఈ నెల 17న మందీమార్బలంతో తోట వెనుక నుంచి కోత మొదలెట్టారు. నిమిషాల్లో దుంగలను వ్యాన్‌లకు లోడ్ చేసి తరలించేశారు. పేరుకు యూకలిప్టస్ అయినప్పటికీ ఎర్ర చెందనాన్ని తలపించేలా ఉన్న దుంగలను టన్నుల లెక్కన వ్యాన్‌లపై తరలించేశారు. నిత్యం పర్యవేక్షించే రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు ఫిర్యాదు చేసిన తరువాత కూడా కలపను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రెవెన్యూ సిబ్బంది కళ్ల ముందే కలపను వ్యాన్‌లతో తరలించేశారు.
ఇటీవలే పుట్టుకొచ్చిన దొంగ పట్టా
కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉన్న యూకలిప్టస్ తోటకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేత పేరున దొంగ పట్టా పుట్టుకొచ్చింది. స్ధానికంగా తోటల క్రయవిక్రయాలే వృత్తిగా చేసుకున్న టీడీపీ నేత దొంగ పట్టాను చూపిస్తూ కోడూరు రెవెన్యూ పరిధిలో ఇప్పటికే పలు ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. కొన్నింటికి సాగుహక్కు చూపిస్తూ ప్రభుత్వం నుంచి ల్యాండ్ పూలింగ్‌లో కోట్ల రూపాయలు నొక్కేశారు. ఇది చాలక ఇప్పుడు నేరుగా కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న తోటను కూడా కనుమరుగు చేసేస్తున్నారు.
కలెక్టర్ బంగ్లా ఎదురుగా కలప దొంగలు
కలెక్టర్ బంగ్లా ఎదురుగా కలప దొంగలు


