మంచు కురిసే వేళలో..
చోడవరం: చలి చక్కిలిగిలి పెడుతోంది. మంచుతో నిండిన ప్రకృతి అందమైన దృశ్యాలతో అలరిస్తోంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు గజగజా వణికిస్తున్నా యి. పది రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. జనవరి రెండో వారం వరకూ ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. జిల్లాలో చోడవరం నుంచి ఏజెన్సీ వాతావరణం కనిపిస్తుంది. మాడుగుల నుంచి ఏజెన్సీని తలపిస్తుంది. సాధారణంగా శీతాకాలంలో ఇక్కడ 8 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ఏడాది చలి మరీ ఎక్కువగా ఉంది. భారీగా కురుస్తున్న పొగమంచు గ్రామాలను కమ్ముకోవడంతో గ్రామాలన్నీ కనుమరుగైనట్టుగా మంచుతెరల్లో చిక్కుకొని కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటినా రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేనంత మంచు కురుస్తుండటంతో లైట్లు వేసుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. భారీగా కురుస్తున్న మంచుకు జనం ఇబ్బందులు ఇలా వుంటే ఆ మంచు సోయగాల్లో ఎన్నో అందమైన ప్రకృతి అందాల దృశ్యాలు ఆవిషృతమవుతున్నాయి.
పొగమంచు మరో సమస్య
రూరల్ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా పగటి వేళల్లో ఉదయం 9 గంటల వరకూ లైట్లు వేసుకొని ప్ర యాణం చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎందుకు చలి పెరుగుతోంది?
భూతాపం పెరగడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులు కూడా కారణమని చెబుతున్నారు.


