
వైజాగ్‌లోవండర్ పార్క్
విజ్ఞానం, వినోదం పంచే బయోడైవర్సిటీ పార్క్ ● తెలుగు రాష్ట్రాల బయాలజీ విద్యార్థుల సందర్శన
ప్రకృతి అద్భుతాలకు చిరునామా
ఈ పార్క్ కేవలం చెట్ల సమాహారం కాదు.. జీవవైవిధ్యానికి ఓ నిలువుటద్దం. అంతరించిపోతున్న జాతుల నుంచి విదేశీ వింతల వరకు ఇక్కడ కొలువుదీరిన ప్రతీ మొక్కకూ ఓ ప్రత్యేక కథ ఉంది. పార్క్ సమన్వయకర్త డాక్టర్ ఎం.రామమూర్తి పర్యవేక్షణలో ఈ మొక్కల విశిష్టతలను విద్యార్థులకు, సందర్శకులకు వివరిస్తుండటం ఇక్కడి అదనపు ఆకర్షణ. ఈ పార్కులోని కొన్ని మొక్కల గురించి తెలుసుకుందామా?
పార్కులో పెంచుతున్న అరుదైన మొక్కలు
నగర జీవితంలోని కాంక్రీట్ జంగిల్‌కు భిన్నంగా, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఉందా? అరుదైన మొక్కల గురించి తెలుసుకుంటూ, వాటి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా పెదవాల్తేరులోని బయోడైవర్సిటీ పార్క్‌ను సందర్శించాలి. రాణి చంద్రమణి దేవి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఈ ఉద్యానవనం.. ఎన్నో వింతలు, విశేషాలతో ప్రకృతి ప్రియులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
– బీచ్‌రోడ్డు
ప్రేమను పంచే మొక్కలు
ప్రేమకు గుర్తు గులాబీ పువ్వు మాత్రమే కాదు. అనేక అరుదైన మొక్కలు, వాటి పువ్వులు, ఆకులు కూడా ఉన్నాయి. బయోడైవర్సిటీ పార్కులో ఇటువంటి ప్రత్యేకమైన మొక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా చెట్లపై పేర్లు రాస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ‘వాలెంటైన్స్ ప్లాంట్’అనే ఒక మొక్క ఉంది. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉండటం వల్ల వాటిపై పేర్లు రాసుకోవచ్చు. ఇలా రాసిన పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. అలాగే ‘వాలెంటైన్స్ హార్ట్’అనే మరో అరుదైన మొక్క కూడా ఈ పార్కులో ఉంది. ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్క చూడటానికి లవ్ సింబల్ ఆకారంలో ఉంటుంది. ఈ ప్రత్యేకత ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మొక్కను ‘స్వీట్ హార్ట్’అని కూడా పిలుస్తారు. ఇంకా ‘మిలియన్స్ హార్ట్స్’మొక్క పార్కుకు వచ్చే యువతీ యువకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకే మొక్కకు వందల సంఖ్యలో గుండె ఆకారపు ఆకులు ఉండటం దీని ప్రత్యేకత. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతోనే దీనికి ‘మిలియన్స్ హార్ట్స్’అనే పేరు వచ్చింది.
షేవింగ్ బ్రష్ ట్రీ
పేరుకు తగ్గట్టే దీని పువ్వులు అచ్చం షేవింగ్ బ్రష్‌ను పోలి ఉంటాయి. ఇది ఒక ఎడారి మొక్క. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీని పూల కేశాలు సన్నటి తీగల్లా ఉంటాయి. లావుగా ఉండే దీని కాండం నీటిని నిల్వ చేసుకుంటుంది. వేసవిలో నీటి కొరత ఏర్పడినప్పుడు, ఆ నీటినే వాడుకుని జీవిస్తుంది. ప్రకృతి ఎంత గొప్ప ఇంజినీరో చెప్పడానికి ఈ మొక్క ఒక ఉదాహరణ.
కృత్రిమ హౌస్‌లో ఆర్కిడ్ల సోయగం
ప్రపంచంలోనే అత్యంత అందమైన పూల జాతుల్లో ఆర్కిడ్‌లు ఒకటి. వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన మొక్కలు జీవ వైవిధ్య ఉద్యానవనంలో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ మొక్కలు సాధారణంగా చల్లని ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి మట్టిలో కాకుండా చెట్ల కాండాన్ని అల్లుకుని పెరుగుతూ, గాలిలోని తేమను పీల్చుకుంటూ జీవిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి అధికంగా పుష్పిస్తాయి. ఆర్కిడ్‌ల ఆకారాలు, రంగులు విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆర్కిడ్‌లు జీవించడానికి చల్లని వాతావరణం అవసరం.’అని సమన్వయకర్త రామ్మూర్తి తెలిపారు. అందుకే జీవ వైవిధ్య ఉద్యానవనంలో ప్రత్యేకంగా ఒక కృత్రిమ ఆర్కిడ్ హౌస్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ తొట్టెల్లో బొగ్గు, కొబ్బరి పీచులను ఉపయోగించి మొక్కలను సంరక్షిస్తున్నారు. డ్యాన్సింగ్ లేడీ, ఎరైడ్స్ మల్టీఫోర, డెండ్రోబియం ఎఫిల్లా, సింబిడియం వంటి అనేక రకాల ఆర్కిడ్ మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. వాటికి పూసే పువ్వులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మన దేశంలో మేఘాలయ, సిమ్లా ప్రాంతాల్లో ఇవి అధికంగా కనిపిస్తాయి.
కొండగోగు
అంతరించిపోతున్న మొక్కల్లో ఇదొకటిగా చెబుతారు. ఈ మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని పచ్చి కొమ్మలకు మంటపెడితే భగ్గున మండుతాయి. పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలను అధికంగా ఆకర్షించే దీని పువ్వులు కప్పు ఆకారంలో ఉండటం మరో విశేషం.
విద్యార్థులకు ప్రయోగశాల
ఈ బయోడైవర్సిటీ పార్క్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయాలజీ విద్యార్థులకు ఒక సజీవ ప్రయోగశాలగా మారింది. తమ పరిశోధనలు, ప్రాజెక్టుల కోసం విద్యార్థులు తరచూ ఇక్కడికి వస్తుంటారు. డాక్టర్ రామమూర్తి వారికి మొక్కల చరిత్ర, వాటి పెంపకం, వైద్య, పర్యావరణ ప్రయోజనాలను వివరిస్తూ వారిలో ప్రకృతిపై ఆసక్తిని పెంచుతున్నారు.

వైజాగ్‌లోవండర్ పార్క్

వైజాగ్‌లోవండర్ పార్క్

వైజాగ్‌లోవండర్ పార్క్

వైజాగ్‌లోవండర్ పార్క్

వైజాగ్‌లోవండర్ పార్క్

వైజాగ్‌లోవండర్ పార్క్

వైజాగ్‌లోవండర్ పార్క్