
వెంకన్నకు సమర్పించిన కానుకలకు రశీదులు ఇప్పించండి
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామికి తాము సమర్పించిన కానుకలకు రశీదులు ఇప్పించాలని భక్తులు కోరారు. బుధవారం ఉపమాకకు చెందిన కర్రిగురువోజి, వమ్మవరానికి చెందిన శ్రీకాకుళపు బంగారు శెట్టిలు దేవస్థాన ఇన్‌స్పెక్టర్ కూర్వేశ్వరరావును కలిశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన కల్యాణోత్సవాల సందర్భంగా గురువోజి పావుతులం బంగారు ఉంగరాన్ని, బంగారు శెట్టి తులం బంగారు శతమానా లను స్వామివారికి కానుకలుగా అందజేశారు. వీటిని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులకు అందజేశామన్నారు. రశీదు ఇమ్మని కోరగా కల్యాణోత్సవాల్లో బిజీగా ఉండటం వల్ల తర్వాత రశీదు ఇస్తామని మరోసారి రావాలని చెప్పారన్నారు. ఇంతవరకు రశీదులు ఇవ్వలేదన్నారు. తాము స్వామివారికి ఇచ్చినకానుకలకు రశీదులు ఇప్పించి, ఆ వస్తువులు స్వామివారికిచెందేలా చూడాలని కోరారు.దీనిపై ఇన్‌స్పెక్టర్ కూర్మేశ్వరరావు మాట్లాడుతూ భక్తులు తెలిపిన వివరాల ప్రకారం కానుకలు తమ వద్దకు ఇంకా రాలేదన్నారు. ఆ వస్తువులు తన వద్దకు వస్తే టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దేవస్థానం అప్రైజర్‌తో తనిఖీలు చేసి, దాతలు పేర్కొన్న విధంగా వస్తువుల బరువు సరిచూసి రశీదు అందజేయడం జరుగుతుందన్నారు.ఇన్‌స్పెక్టర్‌ను కలిసిన వారిలో దేవస్థానం మాజీ చైర్మన్ కొప్పిశెట్టి కొండబాబు, నాయకులు కొప్పిశెట్టి జగదీశ్వరరావు, వాసు, తోలేటి శ్రీను తదితరులు ఉన్నారు.
ఉపమాక దేవాలయ ఇన్‌స్పెక్టర్‌ను కోరిన భక్తులు