
‘అన్నదాత’కు ఆపసోపాలు
కశింకోట: అన్నదాత సుఖీభవ పథకంలో నమోదు చేసుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భూముల రీ–సర్వేలో కొందరి ఆధార్, సెల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయపోవడం, మరికొందరికి తప్పుగా నమోదు చేయడం, భూముల వివరాలు, పేర్లలో తప్పులు చోటు చేసుకోవడం రైతులను కష్టాల పాలు చేస్తోంది. తప్పులు సరిచేసుకోవడం రైతుల బాధ్యతని అధికారులు చెబుతుండడంతో వ్యవసాయ, తహసీల్దార్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని ఒత్తిడి పేరుతో అధికారులు, సిబ్బంది రైతుల పట్ల అసహనం వ్యక్తం చేస్తుండడంతో పాటు సకాలంలో పనులు జరగక నానా అవస్థలు పడుతున్నారు. పథకంలో చేరేందుకు ఈ నెల 20వ తేదీ ఆఖరు రోజు. గడువు నేటితో ముగుస్తున్నా సుఖీభవ పథకంలో నమోదైన వారి సంఖ్య జిల్లాలో 25 శాతం కూడా లేదు.
కొత్త జాబితా తయారీ
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 అందించే వారు. ఈ పథకం స్థానంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు వివరాల సేకరణ చేపట్టింది. ప్రభుత్వ సిబ్బంది సుఖీభవ పథకానికి అర్హులను గుర్తించడానికి రైతుల నుంచి డేటా సేకరిస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న జాబితా ఆధారంగా రైతుల పట్టాదారు పాసు పుస్తకం నకలు, లేదా 1బి, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్లను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా రైతుల జాబితాలో ఉన్న మేరకు రికార్డులను సరిపోల్చి మరో జాబితాను తయారు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆధార్ కార్డు నంబర్, సెల్ ఫోన్ నంబర్లు రీ–సర్వే రికార్డులకు అనుసంధానం కాకపోవడం, రైతుల పేర్లు తప్పుగా నమోదు కావడంతో సుఖీభవ పథకం నమోదుకు రైతు సేవా కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. రికార్డులను సవరించుకోవాలని తహసీల్దార్, వీఆర్వోల వద్దకు పంపుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికే ఈ క్లిష్టమైన ప్రక్రియను ప్రవేశపెట్టారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
50 వేల మంది మాత్రమే నమోదు
గతంలో రైతు భరోసా కింద జిల్లాలో 2.30 లక్షల మంది వరకు లబ్ధి పొందారు. వీరిలో ఇప్పటి వరకు 50 వేలు పైబడి మాత్రమే నమోదు అయినట్లు అధికారిక సమాచారం. ఇంకా కౌలు రైతులకు కౌలుదారి కార్డులు ఇవ్వలేదు. వారిని కూడా నమోదు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నమోదు గడువు పొడిగించగలరని అధికారులు పేర్కొంటున్నారు. రికార్డులు సవ్యంగా ఉన్న జాబితాను విజయవాడ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో నివేదిస్తే దాన్ని పరిశీలించి అక్కడ తుది జాబితాను రూపొందించి రైతు సేవా కేంద్రాలకు పంపుతారని, దీంతో అర్హుల ఫేషియల్‌తో ఈకేవైసీ చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇది జరగడానికి సమయం కూడా ఎక్కువ పడుతుందని, వచ్చే నెలలో ఈ ప్రక్రియ పూర్తి కాగలదంటున్నారు.
భూముల రీ–సర్వే పరిగణన
అన్నదాత సుఖీభవ పథకానికి భూముల రీ–సర్వే డేటాను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జిల్లాలో 64 శాతం గ్రామాల్లో రీ– సర్వే పూర్తయిందని సమాచారం. రీ–సర్వే జరగని గ్రామాల్లో మాత్రం పాత పట్టాదారు పాసు పుస్తకాల డేటాను ఆధారంగా తీసుకుని పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రీ–సర్వేలో భూముల విభజన, పంపకాలు జరగడం వల్ల న్యాయంగా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సి ఉంది.
రీ సర్వే భూ పత్రాల్లో ఆధార్, సెల్ నంబర్లు నమోదులో నిర్లక్ష్యం
ఇది రైతుల బాధ్యత అంటున్న అధికారులు
అన్నదాత సుఖీభవ నమోదుకు తిరస్కరణ
దరఖాస్తుకు నేడు ఆఖరి రోజు
25 శాతం కూడా లేని నమోదు
రికార్డుల సవరణకు రెవెన్యూ, సచివాలయ, వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది
భూమి వివరాలతో ఆధార్ సంఖ్య అనుసంధానం కాలేదు. దీంతో అన్నదాత సుఖీభవ పథకంలో నమోదుకు వ్యవసాయ శాఖ సిబ్బంది తిరస్కరించారు. సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి సవరించుకోవాలని సూచించారు. సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. రీ–సర్వే సమయంలో ఆధార్ సంఖ్య నమోదు చేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం.
– ముక్కా సత్తిబాబు, రైతు,
వెదురుపర్తి గ్రామం
25 శాతం రైతుల రికార్డులు సరిపోల్చాం
అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లాలో 25 శాతం మంది రైతుల రికార్డులను సరిపోల్చాం. ఇంకా 75 శాతం వరకు రికార్డులు సరిపోల్చాల్సి ఉంది. దీనివల్ల పథకానికి నమోదుకు గడువు పెరగగలదు. ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం, పేర్లు తప్పులు పడటం తదితర వాటిని సవరించేందుకు తహసీల్దార్, వీఆర్వోల వద్దకు సిఫారసు చేస్తున్నాం. కౌలు రైతులకు ఈ పథకం వర్తింపునకు ఇంకా కార్డులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2.30 లక్షల మంది వరకు ఈ పథకానికి లబ్ధిదారులు ఉంటారని అంచనా.
– బి.మోహనరావు,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అనకాపల్లి

‘అన్నదాత’కు ఆపసోపాలు

‘అన్నదాత’కు ఆపసోపాలు