నా కొడుకును చంపేశారు.. | - | Sakshi
Sakshi News home page

నా కొడుకును చంపేశారు..

May 20 2025 1:22 AM | Updated on May 20 2025 1:22 AM

నా కొడుకును చంపేశారు..

నా కొడుకును చంపేశారు..

● రోడ్డు ప్రమాదమంటున్నారు ● కలెక్టరమ్మ న్యాయం చేయాలి ● పీజీఆర్‌ఎస్‌లో వృద్ధుడి ని‘వేదన’

తుమ్మపాల: రాజకీయ ప్రలోభాలతో హత్యకు గురైన తన కుమారుడి మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కేసు నీరుగార్చుతున్నారని నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన బండారు మహలక్ష్మి వాపోయారు. ఈ కేసు దర్యాప్తును రీ ఓపెన్‌ చేయమని పోలీసులను ఆదేశించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌కు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తప్పుగా నమోదు చేసిన క్రైం నంబరు 5/2025ను రీఓపెన్‌ చేసి హత్య కోణంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి 11న రాత్రి 11 గంటల సమయంలో శరీరంపై అనేక గాయాలతో రక్తపు మడుగులో తన కుమారుడు బండారు అప్పన్న కనిపించాడని, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్‌ అధికారులు హత్య అని చెప్పారని పేర్కొన్నారు. హంతకులను గుర్తించి జైలుకు పంపిస్తామని చెప్పిన పోలీసులు నేటికీ దర్యాప్తులో పురోగతి సాధించలేదన్నారు. ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో పోలీసులను సంప్రదించగా, మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై తన కుమారుడు మరణించినట్లు తానే స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు పోలీసులు రాశారని తెలిపారు. తన కుమారుడికి మద్యం అలవాటు లేదని, హత్య జరిగిందని స్పష్టంగా చెప్పినా పోలీసులు తప్పుడు స్టేట్‌మెంట్‌ రాయడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఐదు నెలలుగా కేసును నీరుగార్చి గాలికొదిలేశారని, ఈ హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందన్నారు. తక్షణమే కేసును రీ ఓపెన్‌ చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆయన కోరారు.

త్వరితగతిన లక్ష్యాలు పూర్తి చేయండి: కలెక్టర్‌

తుమ్మపాల: వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో ఆమె సోమవా రం సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సర్వే, సంపద తయారీ కేంద్రాలు, డ్వామా, హౌసింగ్‌, సూర్యఘర్‌, పంచాయతీ రాజ్‌లో పలు అంశాల పురోగతిపై ఆమె మాట్లాడారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. బోర్ల మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న వర్క్‌ ఫ్రం హోమ్‌, మనమిత్ర సేవలు, పిల్లల ఆధార్‌ నమోదు, ఈకేవైసీ వంటి సర్వేలను తక్షణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. పన్నుల వసూలు రెండు రోజు ల్లో పూర్తి చేయాలన్నారు. ఫారం ఫాండ్స్‌, పశువుల నీటి తొట్టెల నిర్మాణం తక్షణం చేపట్టాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి భూమిని గుర్తించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement