
దొంగ నోట్ల ఉచ్చులో వ్యాపారులు
నర్సీపట్నం: దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. చిరు వ్యాపారులు తెలియక తీసుకుని తరువాత లబోదిబోమంటున్నారు. మూడు రోజుల కిందట పెద్ద బొడ్డేపల్లి ఆర్డీవో బంగ్లాకు సమీపంలోని పండ్ల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి రూ.500 నకిలీ నోటుతో పండ్లు కొనుగోలు చేశాడు. ఆ వ్యాపారి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా ఆ నోటు నకిలీదిగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు.
● తాజా సోమవారం మున్సిపాలిటీ కొత్తవీధిలో నివాసం ఉంటూ కొత్తకోటలో ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్న సాంబశివ దొంగ నోట్లతో ఉన్న సంచిని నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. సాంబశివ తన భార్యను ఊరు పంపించేందుకు బైక్ పై నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తీసుకొచ్చారు. బస్సెక్కించి వచ్చే సరికి బైక్‌పై సంచి ఉంది. అందులో పాత జీన్ ప్యాంటు, ఒక షర్ట్‌తో పాటు రెండు కొత్త రూ.500 నకిలీ నోట్ల కట్టలు ఉన్నాయి. కంగారు పడిన టీచర్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సూచన మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో నోట్ల కట్టలతో కూడిన సంచిని అప్పగించారు. ఇవి అమెజాన్ చిల్ట్రన్ బ్యాంక్ నుంచి రప్పించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.1000 అసలు నోట్లు చెల్లిస్తే పదివేల రూపాయలు 500 నోట్ల కట్లను పంపిస్తున్నారు. ఒక్కోసారి ఈ నకిలీ 500 నోట్ల కట్టలకు ఆఫర్స్ పెడుతున్నారు. ఒకప్పుడు మిషన్ల ద్వారా దొంగ నోట్లు ప్రింటింగ్ చేసి చలామణి చేసేవారు. ఇప్పుడు అమెజాన్ నోట్లు.. దొంగ నోట్ల చలామణి చేసే వ్యక్తులకు ఒక వరంగా మారాయి. చిల్ట్రన్ బ్యాంక్ పేరుతో కార్పొరేట్ దిగ్గజ కంపెనీ అమెజాన్ ద్వారా పంపిణీ అవుతున్న 500 నోట్ల కట్టల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే నర్సీపట్నం పోలీసు స్టేషన్‌లో రైస్ పుల్లింగ్ కేసులో 10 లక్షల అమెజాన్ చిల్ట్రన్ బ్యాంక్‌కు చెందిన దొంగ నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఇటీవల నర్సీపట్నం దుకాణాల వద్ద కూడా ఈ నకిలీ 500 నోట్లు వెలుగు చూశాయి. అసలు, నకిలీ నోట్లకు తేడా తెలియని చిరు వ్యాపారులు మోసపోతున్నారు.
మూడు రోజుల కిందట పెద్ద బొడ్డేపల్లిలో వెలుగులోకి..
తాజాగా దొంగ నోట్లను పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన ఓ టీచర్