
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
అనకాపల్లి టౌన్: నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన కుమార్తె కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి హద్దులు లేవు. పాపను ఎత్తుకొని ముద్దాడింది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. కలకలం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తల్లీబిడ్డలను ఒక్కటి చేశారు. అనకాపల్లి లోకవారి వీధిలో నివసిస్తున్న కశింకోట మండలం గవరపేట వీధికి చెందిన కూలీ దంపతులు భీశెట్టి హరీష్, లలిత ఈనెల 14న పనిలోకి వెళ్లాక వారి నాలుగేళ్ల చిన్నారి లోహిత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. మర్నాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ విజయకుమార్ నేతృత్వంలో ఎస్సైలు సత్యనారాయణ, ఈశ్వర్‌రావు, వెంకటేశ్వరరావులు, సీసీఎస్ ఎస్‌ఐలు అశోక్‌కుమార్, స్వామినాయుడు, అప్పలరాజు ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల కదలికలను కనిపెట్టారు.
చాక్లెట్ ఆశ చూపించి..
సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. చిన్నారి ఒక మహిళను అనుసరిస్తూ వెళ్లింది. డెయిరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి, మరికొన్ని చాక్లెట్లను చూపించి, నిందితురాలు బాలికను ఆకర్షించింది. పెరుగుబజార్‌లో బాలికతో కలిసి అనకాపల్లి–విశాఖ 500 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో 14వ తేదీ సాయంత్రం 5.50 గంటలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఫేస్ ఐడెంటిఫికేషన్‌తో మహిళ ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. వెంటనే మహిళ ఫోటోను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి ఆమెను గాజువాకలో పెందగంట్యాడ నివాసి టొంటోని లక్ష్మీగా గుర్తించారు. పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిందితులు టొంటోని లక్ష్మీ, ఆమె భర్త టొంటోని అప్పలస్వామి బాలికతో కలిసి బొలెరో వాహనంలో అనకాపల్లికి చెందిన బోనాలా దేవిని కలవడానికి అనకాపల్లికి వస్తుండగా.. జలగలమదుం జంక్షన్ వద్ద అనకాపల్లి టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
పిల్లల దొంగల ముఠా అరెస్టు
వివరాలు వెల్లడించిన ఎస్పీ
సంచలనం సృష్టించిన మిస్సింగ్ కేసు వివరాలను ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనకాపల్లికి చెందిన బోనాల దేవి సూచనలతో గాజువాకకు చెందిన టొంటోని లక్ష్మి అనకాపల్లి వచ్చి పాపను మాయం చేసిన విషయం గుర్తించామన్నారు. నిందితులు ముగ్గురినీ విచారించగా పాపను విక్రయించడానికి ప్రయత్నించినట్లు అంగీకరించారని తెలిపారు. మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితురాలు లక్ష్మి విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కిడ్నీ రాకెట్ కేసులో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడు టొంటోని అప్పలస్వామి రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఇన్‌చార్జ్ డీఎస్పీ బి.మోహన్‌రావు, టౌన్ సీఐ టీవీ విజయ్‌కుమార్ బృందానికి నగదు రివార్డు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

తల్లిదండ్రుల చెంతకు చిన్నారి

తల్లిదండ్రుల చెంతకు చిన్నారి