
రోగి వైద్య సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
● జిల్లా ప్రోగ్రాం మేనేజ్‌మెంటు అధికారి ప్రశాంతి ● జిల్లాలో అన్ని పీహెచ్‌సీలకు సమాచారం ● నాతవరం పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
నాతవరం: ప్రభుత్వం నుంచి కొత్తగా వచ్చిన ఆదేశాల ప్రకారం పీహెచ్‌సీలలో వైద్యులు పరీక్షించిన రోగి తాలుకా ఆరోగ్య సమాచారాన్ని విధిగా ఆన్‌లైన్‌లో డిజిటల్ రికార్డు నమోదు చేయాలని జిల్లా ప్రోగ్రాం మేనేజమెంట్ అధికారి (డీపీఎంవో)జె.ప్రశాంతి అన్నారు. మండల కేంద్రంలో గల పీహెచ్‌సీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న వైద్య సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేసిన రికార్డులను స్వయంగా పరిశీలించారు. పీహెచ్‌సీకి రోజు వారీ వస్తున్న రోగుల వివరాలను వైద్యాధికారి ప్రసన్నను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలో ప్రధాన సమస్యలు, సిబ్బంది వివరాలు అడిగి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి కొత్తగా వచ్చిన ఆదేశాల ప్రకారం పీహెచ్‌సీలో రోగికి అందించిన వైద్యం, మందుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆ రోగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పీహెచ్‌సీలో వైద్యం కోసం వెళ్తే ఆ రోగికి గతంలో ఏవ్యాధి ఉండేది ఏయే మందులు అందజేశారనే పూర్తి సమాచారం ఆధార్ నంబర్ ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే తెలుస్తుందన్నారు. డీఎంహెచ్‌వో ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ప్రసన్న , ఫార్మసిస్టు వెంకటరావు , హెల్త్ సూపర్‌వైజర్లు బైరాగి, వెంకటరమణ పాల్గొన్నారు.