
పింఛన్ల డ్యూటీ నుంచి మినహాయించాలి
అనకాపల్లి: గ్రామాల్లో సామాజిక పింఛన్లు పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు రెండు, మూడు నెలలు పాటు సహకరించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నాగశేషు తెలిపారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పిల్లల బరువు తీయడం, టీహెచ్‌ఆర్(టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేయడం, పిల్లలకు వండి పెట్టడం, ప్రీ స్కూల్ నిర్వహించటం, యాప్‌లో అప్‌లోడ్ చేయడం ఇలా అనేక పనులతో సతమతమవుతున్న నేపథ్యంలో పెన్షన్ పంపిణీ భారం మోపొద్దన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది తీవ్ర పని ఒత్తిడితో అనార్యోగానికి గురవుతున్నట్లు వాపోయారు. గుంటూరులో రాజకీయ జోక్యం వల్ల ఒక కార్యకర్తను సస్పెండ్ చేశారన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఎం. దుర్గరాణి, సభ్యురాలు సిహెచ్ రామలక్ష్మి, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.